LOADING...
Dwayne Bravo: ఎంఎస్‌ ధోని నాకు సోదరుడితో సమానం : బ్రావో
ఎంఎస్‌ ధోని నాకు సోదరుడితో సమానం : బ్రావో

Dwayne Bravo: ఎంఎస్‌ ధోని నాకు సోదరుడితో సమానం : బ్రావో

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో (Dwayne Bravo) టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (MS Dhoni) మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢమో మరోసారి వెలుగులోకి వచ్చింది. ధోనిని తనకు సోదరుడితో సమానమని పేర్కొన్న బ్రావో.. 'బ్రదర్‌ ఫ్రమ్‌ అనదర్‌ మదర్‌' అంటూ వారి మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని భావోద్వేగంగా వివరించాడు. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) ఐపీఎల్‌లో (IPL) అద్భుత విజయాలు సాధించిందని బ్రావో గుర్తు చేశాడు. ధోని వ్యవహార శైలి ఆటగాళ్లలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, చాలా సందర్భాల్లో తనకు ధోని వెన్నుదన్నుగా నిలిచాడని వెల్లడించాడు. ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ బ్రావో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

Details

ప్లేస్‌మెంట్‌ విషయంలో ధోని ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు

'ఒక దశలో ఫీల్డింగ్‌లో నేను డైవ్‌ చేయొద్దని ధోని చెప్పాడు. నాలుగు పరుగులు ఆపడం కన్నా నేను వేసే నాలుగు ఓవర్లే జట్టుకు కీలకమని వివరించాడు. ఆ తర్వాత నుంచి సర్కిల్‌లోపలే ఫీల్డింగ్‌ చేయడం మొదలుపెట్టానని బ్రావో తెలిపాడు. అలాగే మ్యాచ్‌ ప్రారంభంలోనే ధోని తనను ఎలాంటి ఫీల్డింగ్‌ కావాలో అడిగాడని చెప్పాడు. 'నాకు కావాల్సిన ఫీల్డింగ్‌ స్థానం చెప్పిన తర్వాత.. ప్లేస్‌మెంట్‌ విషయంలో ధోని ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. నాపై అతడు పెట్టుకున్న పూర్తి నమ్మకమే దీనికి కారణం. అప్పటినుంచి మేము ఒకరినొకరం "బ్రదర్‌ ఫ్రమ్‌ ఎ డిఫరెంట్‌ మదర్‌" అని పిలుచుకుంటున్నామని బ్రావో వివరించాడు.

Details

రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం

డ్వేన్‌ బ్రావో రెండుసార్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011 నుంచి 2015 వరకు ఒకసారి, 2018 నుంచి 2022 వరకు మరోసారి సీఎస్కే తరఫున ఆడాడు. 2023లో ఆ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా కూడా సేవలందించాడు. అనంతరం 2025లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2011, 2018, 2021, 2022 సంవత్సరాల్లో ఐపీఎల్‌ టైటిళ్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement