WPL : వరుసగా ముంబై ఐదో విజయం.. ప్లేఆఫ్‌లో బెర్త్ ఖరారు
ప్రత్యర్థితో సంబంధం లేకుండా ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయఢంకా మోగించింది. ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో సగర్వంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో మరో మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 50 పరుగులు)తో రాణించగా.. యస్తికా భాటియా 44 పరుగులు, స్కీవర్ బ్రంట్ 36 పరుగులతో సత్తా చాటారు. గుజరాత్ బౌలర్లలో గార్డ్‌నర్ మూడు వికెట్లను పడగొట్టింది.
పాయింట్ల పట్టికలో ముంబై అగ్రస్థానం
అనంతరం లక్ష్య చేధనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ స్నేహ్ రాణా(20), హర్లీన్ డియోల్ (22), సుష్మ వర్మ (18 నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. బ్రంట్, మాథ్యూస్ చెరో మూడు వికెట్లను పడగొట్టి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మూడు అర్ధ సెంచరీలు సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. WPLలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదు మ్యాచుల్లోనూ నెగ్గి ఓటమన్నదే ఎరుగకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.