LOADING...
Amit Shah: నక్సలిజానికి చివరి దశ.. లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
నక్సలిజానికి చివరి దశ.. లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amit Shah: నక్సలిజానికి చివరి దశ.. లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 30, 2026
08:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో ప్రస్తుతం నక్సలిజం దాదాపుగా అంతరించిపోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో నక్సలిజం నిర్మూలన చర్యలపై ఆయన ప్రసంగించారు. సమాజంలో ఎదురయ్యే అన్యాయాలకు పరిష్కారాలు రాజ్యాంగం పరిధిలోనే లభిస్తాయని, ఆయుధాలు ఎత్తుకోవడం సరైన మార్గం కాదని స్పష్టం చేశారు. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయుధపోరాటాన్ని ఎంచుకుంటే దానికి తగిన ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నక్సలిజాన్ని ప్రోత్సహించే వారు గ్రహించాలని హెచ్చరించారు.

వివరాలు 

ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జాడ లేదు..

కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ ఆదివాసీ ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు తీసుకురాలేదని అమిత్ షా విమర్శించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రశ్నించారు. నక్సలిజం వ్యాప్తికి పేదరికమే కారణం కాదని, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల వల్లే ఆ ప్రాంతాలు చాలా కాలం వెనుకబడి ఉన్నాయని ఆయన ఆరోపించారు. మావోయిస్టులు తమదైన శైలిలో సమాంతర పాలన నడిపించారని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించారని, ప్రజలు ఓటు వేయకుండా కూడా అడ్డుకున్నారని వివరించారు.

వివరాలు 

ఆ విషయంలో కేంద్రం సక్సెస్..

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే గిరిజనుల జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. నక్సలిజాన్ని అణచివేయడంలో ప్రధాన పాత్ర కేంద్ర, రాష్ట్ర పోలీసు దళాలదేనని ప్రశంసించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం పొందాయి.

Advertisement