HCA Controversy: హెచ్‌సీఏలో కొత్త వివాదం.. జీవన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలంటూ టీసీఏ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ క్రికెట్ ఆసోసియేషన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలితో పాటు సీఐడీకి అధికారిక ఫిర్యాదు చేసినట్లు టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి వెల్లడించారు. జీవన్ రెడ్డి డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న క్లబ్‌ను కొనుగోలు చేసి హెచ్‌సీఏలోకి ప్రవేశించారని గురువా రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన "ఆక్స్‌ఫర్డ్ బ్లూస్" క్లబ్‌ను గతంలో వెంకటేశ్వరావు నిర్వహించారని, అయితే గతేడాది అదే క్లబ్‌ను మళ్లీ రీ-రిజిస్టర్ చేసి జీవన్ రెడ్డి కార్యదర్శిగా మారారని తెలిపారు.
వివరాలు
జీవన్ రెడ్డి ఎన్నికపై అనుమానం
ఇప్పటికే ఒక జిల్లాలో రిజిస్టర్ అయిన క్లబ్‌ను మరో జిల్లాలో తిరిగి రిజిస్టర్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారమే గతంలో జగన్ మోహన్ రావు చేసినట్లు గుర్తుచేసిన గురువా రెడ్డి.. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అదే తరహా విధానాన్ని అనుసరించారని ఆరోపించారు. సభ్యులు, ఓటర్ల మార్పులకు జనరల్ బాడీ సమావేశం ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ అలాంటి ప్రక్రియ జరగలేదని తెలిపారు. క్లబ్ కొనుగోలు చేసిన మూడు నెలల్లోనే జీవన్ రెడ్డి హెచ్‌సీఏ కార్యదర్శిగా ఎన్నిక కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 2004 నుంచి హెచ్‌సీఏలో అనేక అక్రమాలు, మార్పులు జరుగుతున్నాయని టీసీఏ ఆరోపించింది.
వివరాలు
ప్రభుత్వ జోక్యం ఉండకూడదు
గతంలో జగన్ మోహన్ రావుతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన అనంతరం ఖాళీల భర్తీ పేరుతో పలు కుట్రలు జరిగాయని పేర్కొంది. ఎలాంటి అనుభవం లేని ఇంతియాజ్‌ను సీఈఓగా నియమించారని, అమర్నాథ్‌ను అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించింది. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జీవన్ రెడ్డికి మద్దతు ఇచ్చామని హెచ్‌సీఏ పెద్దలు చెప్పడం ఆశ్చర్యకరమని గురువా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ జోక్యం క్రికెట్ పరిపాలనలో ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇక టీజీ20 లీగ్‌పైనా టీసీఏ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారని ఆరోపించింది.
వివరాలు
అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం
ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని ఆపరేషన్ హెడ్‌గా నియమించారని, ఈవెంట్ మేనేజర్ నిరంజన్‌ను అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో చేర్చారని తెలిపింది. అయితే మాజీ క్రికెటర్లు నియోల్ డేవిడ్, వెంకటపతి రాజు వంటి అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వకపోవడం ప్రశ్నార్థకమని పేర్కొంది. టీజీ20 లీగ్‌లో వయోపరిమితిని 16 నుంచి 36 సంవత్సరాల వరకు నిర్ణయించడం ఎక్కడా చూడలేదని టీసీఏ విమర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లకు ఒక్క రోజులోనే సెలక్షన్ నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. మొత్తం వ్యవహారంపై జీవన్ రెడ్డి ఎన్నికను తక్షణమే రద్దు చేసి, హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.