Shafali Verma: భారత మహిళా క్రికెట్‌లో కొత్త చరిత్ర.. షెఫాలి వర్మకు ఐసీసీ అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ మహిళా క్రికెటర్ షెఫాలి వర్మ (Shafali Verma) నవంబర్ 2025 నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకుంది. ఇటీవల భారత్ మహిళల జట్టు 2025 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. టోర్నీ చివరి దశలో ప్రతీక రావల్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలి.. ఫైనల్‌లో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షెఫాలి 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. బ్యాటింగ్‌తోనే కాకుండా బంతితోనూ ఆమె మెరిసింది.
Details
ఎంతో గర్వంగా ఉంది
ఏడు ఓవర్లు వేసి 36 పరుగులు మాత్రమే ఇచ్చి, అత్యంత కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ దిశను భారత్‌వైపు తిప్పింది. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ టైటిల్ సాధించడంలో షెఫాలి ప్రధాన భూమిక పోషించింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కిన సందర్భంగా షెఫాలి వర్మ ఆనందం వ్యక్తం చేసింది. 'ఫైనల్‌లో జట్టు విజయానికి నా వంతు సహకారం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. స్వదేశంలో ప్రేక్షకుల ముందే తొలిసారిగా ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించడంలో భాగమవడం గర్వంగా ఉంది. నవంబర్ నెలకు గాను మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపిక కావడం నాకు గొప్ప గౌరవమని చెప్పారు.
Details
పురుషుల విభాగంలో సైమన్ హార్మర్ కు అవార్డు
మేము జట్టుగా గెలుస్తాం.. ఈ అవార్డు విషయంలో కూడా అదే జరిగింది' అని ఆమె పేర్కొంది. పురుషుల విభాగంలో నవంబర్ 2025కు గాను సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ (Simon Harmer) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో హార్మర్ మొత్తం 17 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ అవార్డు గురించి హార్మర్ స్పందిస్తూ.. 'ఈ గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉంది. సౌతాఫ్రికా తరఫున ఆడాలన్న నా కల నెరవేరింది. దానికి తోడు వచ్చే గుర్తింపులు, అవార్డులు అన్నీ బోనస్‌లాంటివే. సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, జట్టు విజయాల్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నానని తెలిపాడు.