IPL 2026 : ఐపీఎల్‌లో కొత్త సంచలనం.. 154.2 కి.మీ వేగంతో దుమ్మురేపిన రైతు కుమారుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో భారతీయ ఫాస్ట్ బౌలర్ సంచలనం సృష్టిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న యువ పేసర్ అశోక్ శర్మ, తన అద్భుతమైన వేగం, కచ్చితమైన యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని బౌలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కేవలం వేగమే కాదు, అద్భుతమైన లైన్-లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో అశోక్ శర్మ చూపిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఓవర్ చివరి బంతిని ఏకంగా 154.2 కి.మీ వేగంతో విసిరి ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన డెలివరీగా నమోదు చేశాడు.
వివరాలు
4 ఓవర్లలో 37 పరుగులు
మిడిల్, ఆఫ్ స్టంప్‌లను టార్గెట్ చేస్తూ వేసిన ఆ పర్‌ఫెక్ట్ యార్కర్‌ను ఎదుర్కోవడం ధ్రువ్ జురుల్‌కు సాధ్యం కాలేదు. బంతి నేరుగా ప్యాడ్లను తాకడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.ఈ మ్యాచ్‌లో అశోక్ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నప్పటికీ, అతని వేగం, బౌలింగ్ నాణ్యత ప్రత్యర్థి బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి సృష్టించింది.
వివరాలు
ఎవరీ అశోక్ శర్మ?
అశోక్ శర్మ రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని రాంపూర్ గ్రామానికి చెందినవాడు. 2002 జూన్ 17న జన్మించిన అతని తండ్రి నాథూ లాల్ శర్మ ఒక సాధారణ రైతు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న అశోక్, తన వేగంతో పాఠశాల స్థాయిలోనే గుర్తింపు పొందాడు. దేశవాళీ టోర్నమెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతని పేస్‌ను గమనించిన గుజరాత్ మేనేజ్‌మెంట్ ఈ సీజన్‌లో అతనికి అవకాశం ఇచ్చింది.
వివరాలు
మూడేళ్ల నిరీక్షణ తర్వాత అవకాశం
ఐపీఎల్‌లో అశోక్ ప్రయాణం అంత సులభం కాదు. 2022లో కేకేఆర్ తరుపున అతన్ని రూ.55 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2025లో రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు దక్కించుకున్నా, అక్కడ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే 2026లో గుజరాత్ టైటాన్స్ అతనిపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అశోక్ తన ప్రతిభను చాటుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో అతన్ని "రఫ్తార్ సింగ్" అని పిలుస్తున్నారు.
వివరాలు
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్
సాధారణంగా భారతీయ బౌలర్లు 130-135 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తారు. కానీ అశోక్ శర్మ మాత్రం నిలకడగా 145 కి.మీ పైగా వేగాన్ని నమోదు చేస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హార్డ్ లెంగ్త్ బంతులు, ఇన్‌స్వింగ్ యార్కర్లు వేయడంలో అతను ప్రత్యేక నైపుణ్యం సంపాదించాడు. భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు కూడా అతని పేస్ పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో భారత జట్టుకు అశోక్ శర్మ ఒక కీలక ఆస్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.