Page Loader
Shane Warne: షేన్ వార్న్ మరణం కేసులో కొత్త ట్విస్ట్.. బ్రిటన్ మీడియా సంచలన కథనం!
షేన్ వార్న్ మరణం కేసులో కొత్త ట్విస్ట్.. బ్రిటన్ మీడియా సంచలన కథనం!

Shane Warne: షేన్ వార్న్ మరణం కేసులో కొత్త ట్విస్ట్.. బ్రిటన్ మీడియా సంచలన కథనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్‌ (Shane Warne) మరణం కేసులో ఓ కొత్త కోణం వెలుగు చూసింది. థాయ్‌లాండ్‌లో ఓ విల్లాలో ఆయన హఠాన్మరణం చెందినప్పుడు, గుండెపోటే కారణమని భావించారు. అయితే, తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక విషయం బయటకొచ్చింది. బ్రిటన్ మీడియా సంస్థ డైలీ మెయిల్ ప్రచురించిన సంచలన కథనం ప్రకారం ఘటనా స్థలంలో ఓ 'వస్తువు' తొలగించారని తెలుస్తోంది.

Details

ఒక 'వస్తువు' తొలగింపు - ఏం జరిగింది?

ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం ఘటనా స్థలంలో లైంగిక సామర్థ్యానికి (అంగస్తంభన చికిత్సకు) సంబంధించిన ఓ ఔషధ బాటిల్ లభ్యమైంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ మాత్రలను అక్కడి నుంచి తొలగించామని తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు, ఆ మాత్రలతో పాటు వాంతులు, రక్తపు మరకలు కనిపించాయి. వాటిని అక్కడి నుంచి తీసేయాలని చెప్పినట్లు మాకు ఆదేశాలు వచ్చాయి. అయితే షేన్ వార్న్ ఆ మాత్రలను ఎంత మోతాదులో తీసుకున్నారన్న విషయం తెలియదని చెప్పారు.

Details

 ఆస్ట్రేలియా అధికారుల హస్తం ఉందా? 

ఈ ఘటనపై మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆస్ట్రేలియా అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షేన్ వార్న్‌ హఠాన్మరణం చెందిన తీరు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందున, కొంతమంది ఉన్నతాధికారులు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చని ఆ పోలీసు అధికారి అభిప్రాయపడ్డాడు. 2022 మార్చి 4న థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయి ద్వీపంలోని విల్లాలో షేన్ వార్న్ హఠాత్తుగా మరణించారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Details

మరణానికి గల కారణం ఏమిటి?

వార్నర్ అస్వస్థతకు గురై విల్లాలోనే అచేతనంగా పడి ఉన్నారని, వైద్య బృందం ఎంతగా ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారని వార్న్ సిబ్బంది తెలిపారు. గుండెపోటే కారణమై ఉండొచ్చని భావిస్తున్నామని అప్పట్లో కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే స్థానిక ఆసుపత్రి ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో మాత్రం షేన్ వార్న్ సహజ మరణం చెందారని, ఇందులో ఎటువంటి నేరపూరిత కోణం లేదని పేర్కొన్నారు. కానీ తాజాగా వెలుగుచూసిన ఈ విషయాలు మరింత అనుమానాలకు తావిస్తున్నాయి. వాస్తవానికి షేన్ వార్న్ మరణానికి గల అసలైన కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు.