LOADING...
 Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్‌కు బంగారు పతకం
వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

 Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచకప్‌ బాక్సింగ్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన దూకుడు చాటింది. అద్భుత ఫామ్‌ ప్రదర్శించిన ఆమె 51 కేజీల ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రారంభ రౌండ్‌ నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలో ఉంచిన నిఖత్‌, పదునైన పంచ్‌లతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లో ఓటమి ఎదుర్కొన్న ఈ తెలంగాణ టైగర్‌, తాజా స్వర్ణంతో మళ్లీ గాడిలో పడింది. ఈ ఫైనల్స్‌లో భారత్‌ మొత్తం మరో ఎనిమిది స్వర్ణాలను సొంతం చేసుకుంది.

Details

 70 కేజీల్లో అరుంధతి సత్తా

57 కేజీల విభాగంలో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత వుయీ (చైనీస్‌ తైపీ)పై జైస్మిన్‌ లాంబోరియా విజయం సాధించగా, 60 కేజీల్లో జపాన్‌కు చెందిన తగుచి అయాకాను పర్వీన్‌ హుడా చిత్తు చేసింది. 80 కేజీల కేటగిరీలో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ సొటిమ్‌బొయెవాపై నుపుర్‌ షెరోన్‌ ఆధిపత్యం చాటగా, 70 కేజీల్లో అరుంధతి చౌదరి ఉజ్బెక్‌ బాక్సర్‌ అజీజాపై పైచేయి సాధించింది. 54 కేజీల్లో ఇటలీకి చెందిన సిరిన్‌పై ప్రీతి పన్వర్‌.. 48 కేజీల్లో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ ఫోజిలివాపై మీనాక్షి హుడా స్వర్ణం గెలుచుకున్నారు.

Details

మెరిసిన భారత బాక్సర్లు

పురుషుల విభాగంలో కూడా భారత బాక్సర్లు మెరిశారు. 70 కేజీల ఫైనల్లో కజకిస్థాన్‌‌కు చెందిన నార్‌బెక్‌ను హితేష్‌ గులియా ఓడించాడు. 60 కేజీల్లో కిర్గిజ్‌స్థాన్‌ బాక్సర్‌ మునార్‌బెక్‌పై సచిన్‌ సివాచ్‌ విజయం సాధించి మరో స్వర్ణాన్ని అందించాడు. ఈ క్రీడల్లో భారత్‌ ఐదు రజత పతకాలను కూడా దక్కించుకుంది. మహిళల 50 కేజీలలో జాదుమణి సింగ్‌, 80 కేజీలలో పూజా రాణి, పురుషుల 80 కేజీలలో అంకుశ్‌, 55 కేజీలలో పవన్‌, 65 కేజీలలో అబినాష్‌ ఫైనల్లో పోరాడి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.

Details

భారత్ కు20  పతకాలు

జాదుమణి ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ అసిల్‌బెక్‌ చేతిలో, పవన్‌ సమందర్‌ చేతిలో ఓడిపోయారు. జపాన్‌ బాక్సర్‌ నిషియెమాకు అబినాష్‌.. ఇంగ్లాండ్‌ బాక్సర్‌ ఒలాడ్‌మిజ్‌కు అంకుశ్‌ తలొంచారు. మరోవైపు, పోలెండ్‌ బాక్సర్‌ అగటా చేతిలో అరుంధతి ఓడింది. మొత్తం 20 పతకాలు—9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో—అభినందనీయ ప్రదర్శన చేసిన భారత్‌ ఈ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ను అగ్రస్థానంతో ముగించింది.