BCB: బీసీసీఐతో ఎలాంటి సంప్రదింపులు లేవు : బీసీబీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అభద్రతాభావాన్ని కారణంగా చూపుతూ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్-2026 కోసం భారత్‌కు తమ జట్టును పంపమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ అధికారికంగా ప్రకటించారు. భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడటం తమకు సురక్షితం కాదని, అందువల్ల తమ మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహించాలని బీసీబీ ఇప్పటికే ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టును వరల్డ్‌కప్ కోసం భారత్‌కు పంపే విషయంలో బీసీబీ మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది.
Details
భారత్ కు మా జట్టును పంపడం సురక్షితం కాదు
ఈ నిర్ణయంపై అమినుల్ ఇస్లామ్ మాట్లాడుతూ.. 'మా క్రికెట్ బోర్డు సభ్యులందరితో విస్తృతంగా చర్చించాం. ఈ నిర్ణయానికి ముందుగా రెండు సమావేశాలు నిర్వహించాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా జట్టును భారత్‌కు పంపడం సురక్షితం కాదని మేం భావిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే ఐసీసీకి అధికారికంగా మెయిల్ పంపినట్లు ఆయన వెల్లడించారు. 'మాకు భద్రత అత్యంత ముఖ్యమైన అంశం. ఈ విషయమై త్వరలోనే ఐసీసీతో సమావేశం జరగనుంది. మా తదుపరి చర్యలు పూర్తిగా ఐసీసీ స్పందనపై ఆధారపడి ఉంటాయి. వరల్డ్‌కప్ అనేది ఐసీసీ ఈవెంట్ కావడంతో, ఈ విషయంలో మేం బీసీసీఐతో నేరుగా కమ్యూనికేషన్ జరపడం లేదు' అని అమినుల్ ఇస్లామ్ స్పష్టం చేశారు.