కీలక ఆటగాళ్లకు ప్రాక్టీసు లేదు.. మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ భారత ఫుట్‌బాల్ కోచ్
ఆసియా గేమ్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన సౌదీ అరేబియా మ్యాచులో భారత ఓటమిపాలైంది. దీంతో ఆసియా గేమ్స్ నుంచి భారత ఫుట్ బాల్ జట్టు ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలో భారత్ కోచ్ ఇగార్ స్టిమాక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సరైన సన్నద్ధత లేకుండా జట్టును ఇక్కడికి పంపించారని, కనీసం కీలక ఆటగాళ్లకు ప్రాక్టీసు కూడా అందుబాటులో లేకుండా చేశారని మేనేజ్‌మెంట్‌పై ఇగార్ స్టిమాక్ విమర్శలు గుప్పించాడు. ఆసియా గేమ్స్‌లో భారత జట్టుకు ఈ ఓటమి ఓ గుణపాఠమని, ఇలాంటి టోర్నీలకు పంపే ముందు సరైన ప్రణాళికలు ఉండాలని చెప్పారు.
సరైన ఆటగాళ్లు ఉంటేనే రాణించేందుకు అవకాశం
సరైన సన్నద్ధత లేకుండా ఇలాంటి టోర్నీలకు పంపకూడదని, మరోవైపు అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో లేకుండా ప్రాతినిధ్యం వహించడం చాలా కష్టమని ఇగార్ స్టిమాక్ పేర్కొన్నారు. సరైన ఆటగాళ్లు ఉంటేనే ఇలాంటి భారీ టోర్నీలో రాణించేందుకు అవకాశం ఉంటుందని, తాము భారత్ తరపున ఆడటానికి వచ్చామని, అసియా క్రీడల్లో పాల్గొనే ముందు కనీసం ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా నిర్వహించలేదని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆసియా గేమ్స్ కు భారత ఫుట్ బాల్ జట్టు శాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచింది. దీంతో భారత్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులో తీవ్ర జాప్యం జరిగింది.