LOADING...
Vaibhav Suryavanshi: వైభవ్ విషయంలో తొందర వద్ద.. టీమిండియా ఎంపికపై మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు!
వైభవ్ విషయంలో తొందర వద్ద.. టీమిండియా ఎంపికపై మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు!

Vaibhav Suryavanshi: వైభవ్ విషయంలో తొందర వద్ద.. టీమిండియా ఎంపికపై మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2026
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో 776 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది. ఇప్పటికే శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ ఆటగాడిని, ఈ నెలాఖరులో జరగనున్న ఐర్లాండ్ పర్యటన కోసం సీనియర్ భారత జట్టుకు ఎంపిక చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వైభవ్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువ ఆటగాడి విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

వివరాలు

భారత జట్టులో స్థానం సంపాదించడం అంత సులభం కాదు

స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ మాట్లాడుతూ, "ప్రస్తుతం ఉన్న యువ బ్యాటర్లలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తర్వాత వైభవ్ సూర్యవంశీ స్థానం ఉంటుంది. అయితే అతడిని భారత జట్టులోకి తీసుకుంటే, ఐపీఎల్‌లో ఉన్నట్లే బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితుల్లో అవకాశాలు ఇవ్వాలి. నేరుగా న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికా వంటి కఠినమైన విదేశీ పిచ్‌లపై పరీక్షించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. అలాగే వైభవ్ ఎదుగుదలను సహజంగా సాగనివ్వాలని సూచించారు. ఈ ప్రక్రియను సహజంగా జరగనివ్వాలి. శుభ్‌మన్ గిల్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో పోటీ ఉన్న సమయంలో భారత జట్టులో స్థానం సంపాదించడం అంత సులభం కాదని పేర్కొన్నారు.

వివరాలు

అన్ని ఫార్మాట్లో రాణించే సత్తా ఉండాలి

వైభవ్ కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను అతడే తీసుకోవాలని మంజ్రేకర్ స్పష్టం చేశారు. అతడిని ఎలా తీర్చిదిద్దాలి, రెడ్-బాల్ క్రికెట్‌లో ఎలా రాణిస్తాడు అనే విషయాలను మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు. బీసీసీఐ కూడా అలాంటి పాత్ర పోషించకూడదు. తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా అతడిదేనని చెప్పారు. కేవలం టీ20 క్రికెట్‌లోనే తన కెరీర్‌ను నిర్మించుకోవాలనుకుంటే కూడా అందులో తప్పేమీ లేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. వైభవ్ కేవలం టీ20 స్పెషలిస్ట్‌గా కొనసాగాలనుకుంటే అది అతడి వ్యక్తిగత నిర్ణయం. దాన్ని ఎవరూ తప్పుబట్టలేరు. వన్డే ఫార్మాట్‌లో కూడా అతడు జట్టుకు ఎంతో విలువైన ఆటగాడిగా మారగలడు.

Advertisement

వివరాలు

సెలక్టర్లను ప్రతిభతో మెప్పించాలి

2023 ప్రపంచకప్‌లో తొలి 10 ఓవర్లలో రోహిత్ శర్మ ఆడిన దానికంటే కూడా మరింత దూకుడుగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం అతడిలో ఉందని విశ్లేషించారు. అదే సమయంలో రెడ్-బాల్ క్రికెట్ ఆడాలనుకుంటే మాత్రం కష్టపడి తన స్థానాన్ని సంపాదించుకోవాల్సిందేనని మంజ్రేకర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా అతడిని నేరుగా రంజీ జట్టులోకి తీసుకుంటే, ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్న ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టవుతుంది. రెడ్-బాల్ క్రికెట్‌లో రాణించాలనుకుంటే బీహార్ రంజీ జట్టులో చోటు కోసం పోరాడాలి. సెలక్టర్లను మెప్పించి తన ప్రతిభతో అవకాశాన్ని దక్కించుకోవాలని పేర్కొన్నారు. చివరగా, అనవసరంగా విషయాలను క్లిష్టం చేయకుండా వైభవ్ తన కెరీర్‌కు సంబంధించిన మార్గాన్ని తానే ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని మంజ్రేకర్ సూచించారు.

Advertisement