KL Rahul: రిటైన్ ఆఫర్‌కు నో.. ఎల్‌ఎస్‌జీపై వీడడంపై కేఎల్ రాహుల్ స్పష్టత
2025 ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న విషయం తెలిసిందే. ప్రాంఛైజీలు ఇప్పటికే తమ రిటైన్ లిస్టును కూడా ప్రకటించాయి. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) తరఫున కేఎల్ రాహుల్ తప్పుకున్నాడు. రాహుల్‌ను రిటైన్ చేసుకోవాలని ఎల్‌ఎస్‌జీ ఆసక్తి చూపించినా, రాహుల్ మాత్రం రిటైన్ అయ్యేందుకు నిరాకరించినట్లు తెలిసింది. గత సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదానంలో రాహుల్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాహుల్ తాను ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ తన నిర్ణయంపై స్పష్టత ఇచ్చాడు. తనకు ఆటలో స్వేచ్ఛ అవసరమని, కొత్తగా ప్రయాణం ప్రారంభించేందుకు ఎల్‌ఎస్‌జీని వీడానని చెప్పారు.
జట్టు వాతావరణమే కారణం : రాహుల్
ఐపీఎల్‌లో కొత్త ఆరంభాన్ని కోరుకుంటున్నానని, తన ఆటను నచ్చినట్లుగా ఆడేందుకు స్వేచ్ఛ కావాలన్నారు. అందుకే ఎల్‌ఎస్‌జీని వీడానని, తేలికైన వాతావరణం ఉన్న జట్టులో ఆడాలనుకుంటున్నానని రాహుల్ వివరించాడు. ఈ మెగా వేలంలో కేఎల్ రాహుల్‌కు భారీ ధర పలికే అవకాశముంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, బ్యాటర్‌గా, అలాగే కెప్టెన్‌గా అనుభవం ఉన్న ఆటగాడు కావడంతో ప్రాంఛైజీలు అతని కోసం పోటీ పడనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు రాహుల్ ని తీసుకోవడానికి ముందు వరుసలో ఉన్నాయి.