'అవమానంతో ఆఫీసు నుంచి వెళ్లగొట్టారు' : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్
ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు. ఆఫీసు నుంచి తనను దారుణంగా వెళ్లగొట్టారని, కనీసం తన వస్తువులను కూడా తీసుకెళ్లే అవకాశ ఇవ్వలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలో రమీజ్ తన బాధను వెల్లబోసుకున్నారు. "క్రికెట్ బోర్డుపైకి వచ్చి దాడి చేశారు. నా వస్తువులను కూడా తీసుకోనివ్వలేదు. ఉదయం 9 గంటలకే 17 మంది పీసీబీలోకి దూసుకొచ్చారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ పాకిస్థాన్ వాళ్లు దాడి చేసినట్లుగా వాళ్లు వచ్చారు" అని రమీజ్ వివరించారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రాజ్యాంగాన్నే మార్చేసింది
ఇప్పుడు బోర్డులో ఉన్న వాళ్లకు అసలు క్రికెట్‌పై ఆసక్తి లేదని విమర్శించారు. "ఒక్క వ్యక్తికి పదవి ఇవ్వడానికి మొత్తం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజ్యాంగాన్నే మార్చేశారు. కేవలం నజమ్ సేఠీని తీసుకురావడానికి ఇలా రాజ్యాంగాన్నే మార్చడం ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటి క్రికెట్‌కు సంబంధం లేని వాళ్లు క్రికెట్‌ను కాపాడటానికి ప్రయత్నించాలని చూడటం చూస్తుంటే బాధేస్తుంది. వీళ్లకు క్రికెట్‌పై ఆసక్తి లేదు. కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికే వచ్చారు" అని రమీజ్ విమర్శించారు. గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. పీసీబీ ఛీఫ్‌గా రమీజ్‌ను నియమించారు. 15 నెలల పాటు ఆ పదవిలో రమీజ్ కొనసాగారు.