LOADING...
cricket: క్రికెట్‌లోని వివిధ రకాల డకౌట్ల పై ప్రత్యేక కథనం
క్రికెట్‌లోని వివిధ రకాల డకౌట్ల పై ప్రత్యేక కథనం

cricket: క్రికెట్‌లోని వివిధ రకాల డకౌట్ల పై ప్రత్యేక కథనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2026
06:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నం వేదికగా బుధవారం టీమ్‌ ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ పోరులో కివీస్‌ జట్టు 50 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇలాంటి డిస్మిసల్‌ను గోల్డెన్‌ డక్‌ అని పిలుస్తారన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే క్రికెట్‌లో గోల్డెన్‌ డక్‌తో పాటు మరికొన్ని ప్రత్యేకమైన డకౌట్లు కూడా ఉన్నాయి.

వివరాలు 

డైమండ్‌ డక్‌:

క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపించే డకౌట్‌ ఇది. బ్యాటర్‌ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా నేరుగా పెవిలియన్‌కు చేరితే దాన్ని డైమండ్‌ డక్‌గా పరిగణిస్తారు. ఇది సాధారణంగా రెండు సందర్భాల్లోనే జరుగుతుంది. ఒకటి రన్‌ అవుట్‌ కావడం, రెండోది టైమ్‌డ్‌ ఔట్‌. 2023 వరల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌డ్‌ ఔట్‌గా వెనుదిరగడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ డిస్మిసల్‌ డైమండ్‌ డక్‌ కిందికే వస్తుంది. గోల్డెన్‌ డక్‌: బ్యాటర్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సున్నా పరుగులతో ఔటైతే దాన్ని గోల్డెన్‌ డక్‌ అంటారు. ప్రస్తుత న్యూజిలాండ్‌ సిరీస్‌లో అభిషేక్‌ శర్మ ఇలాగే రెండు సార్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

వివరాలు 

సిల్వర్‌ డక్‌:

బ్యాటర్‌ రెండో బంతికి కూడా పరుగులు చేయకుండా ఔటైతే దాన్ని సిల్వర్‌ డక్‌గా వ్యవహరిస్తారు. బ్రాంజ్‌ డక్‌: పరుగుల ఖాతా తెరవకుండానే మూడో బంతికి పెవిలియన్‌ చేరితే ఆ డిస్మిసల్‌ను బ్రాంజ్‌ డక్‌గా పిలుస్తారు. రాయల్‌ డక్‌ (ప్లాటినమ్‌ డక్‌): ఈ రకం డక్‌ ఓపెనర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఓపెనర్‌ తన మొదటి బంతికే ఔటైతే దాన్ని రాయల్‌ డక్‌ లేదా ప్లాటినమ్‌ డక్‌ అంటారు. విశాఖపట్నం మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ ఔటైన తీరును ఈ కోవలో కూడా చెప్పవచ్చు.

Advertisement

వివరాలు 

లాఫింగ్‌ డక్‌:

ఒక జట్టు ఇన్నింగ్స్‌లో చివరి బంతికి బ్యాటర్‌ డకౌట్‌ అయితే దాన్ని లాఫింగ్‌ డక్‌గా పేర్కొంటారు. పెయిర్‌: ఇది టెస్ట్‌ క్రికెట్‌లో మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఒక బ్యాటర్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటైతే దాన్ని పెయిర్‌ అని అంటారు. కింగ్‌ పెయిర్‌: టెస్ట్‌ మ్యాచ్‌లో బ్యాటర్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటైతే దాన్ని కింగ్‌ పెయిర్‌గా వ్యవహరిస్తారు. టైటానియమ్‌ డక్‌: ఇది డైమండ్‌ డక్‌కు దగ్గరగానే ఉంటుంది. అయితే చిన్న తేడా ఉంటుంది. జట్టు ఇన్నింగ్స్‌ ప్రారంభంలో బ్యాటర్‌ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా, ఒక్క పరుగు కూడా చేయకుండా ఔటైతే దాన్ని టైటానియమ్‌ డక్‌ అంటారు.

Advertisement

వివరాలు 

గోల్డెన్‌ గూస్‌:

గోల్డెన్‌ గూస్‌ డక్‌ అనేది సీజన్‌కు సంబంధించిన డిస్మిసల్‌. ఒక బ్యాటర్‌ కొత్త సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే మొదటి బంతికి సున్నా పరుగులతో ఔటైతే దాన్ని గోల్డెన్‌ గూస్‌ డకౌట్‌గా పిలుస్తారు. మొత్తానికి క్రికెట్‌లో గోల్డెన్‌ డక్‌ మాత్రమే కాదు, ఇలాంటి అనేక రకాల డకౌట్లు ఉన్నాయి. ఇవి ఆటకు మరింత ఆసక్తిని, ప్రత్యేకతను తీసుకొస్తాయి.

Advertisement