Taylor Swift: ప్రేమలోనే కాదు.. సేవలోనూ ముందంజలో టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, ఆమె భాగస్వామి, అమెరికన్ ఫుట్ బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీ తమ ప్రేమ బంధంతోనే కాకుండా సేవా గుణంతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ జంట 2026 జులైలో 20 వేర్వేరు స్వచ్ఛంద సంస్థలకు ఏకంగా 26 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.241 కోట్లు) విరాళంగా అందించి తమ ఉదారతను చాటుకున్నారు. అయితే సేవా కార్యక్రమాలు చేపట్టే విషయంలో వీరిద్దరి విధానాలు భిన్నంగా ఉంటాయి. ఒకరు ఆపదలో ఉన్నవారికి తక్షణ సాయం అందిస్తుంటే.. మరొకరు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవస్థలను నిర్మిస్తున్నారు.
వివరాలు
ఆపదలో ఉన్నవారికి అండగా టేలర్ స్విఫ్ట్
టేలర్ స్విఫ్ట్ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి నేరుగా సాయం అందించడం కనిపిస్తుంది.
తన 'ఎరాస్ టూర్' కచేరీల సందర్భంగా అమెరికా,యూరప్‌లోని పలు నగరాల్లో స్థానిక ఫుడ్ బ్యాంకులకు ఆమె భారీగా విరాళాలు అందించారు.
ఒకేసంస్థకు పెద్ద మొత్తంలో సాయం చేయకుండా.. ప్రతి నగరంలోని స్థానిక సంస్థలకు విరాళాలు ఇవ్వడం ఆమె ప్రత్యేకత.
యూకేలోని ఎడిన్‌బర్గ్, లివర్‌పూల్, లండన్ వంటి నగరాల్లో స్విఫ్ట్ అందించిన విరాళాలు తమకు ఊహించనివని, ఎంతో సంతోషాన్ని కలిగించాయని ట్రసెల్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధి సోఫీ కారే తెలిపారు.
స్విఫ్ట్ పేరు వార్తల్లోకి రావడం వల్ల ఫుడ్ బ్యాంకుల అవసరంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఇది విరాళం కంటే కూడా విలువైనదని ఆమె అభిప్రాయపడ్డారు.
వివరాలు
5 మిలియన్ డాలర్లు విరాళం
తుపానులు, కార్చిచ్చులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా స్విఫ్ట్ ఉదారంగా స్పందిస్తుంటారు.
2024లో హరికేన్ల బాధితులకు సహాయం చేసేందుకు ఫీడింగ్ అమెరికా సంస్థకు 5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
వీటితోపాటు పిల్లల ఆసుపత్రులు, క్యాన్సర్ పరిశోధనలు, విద్య, సంగీత శిక్షణ వంటి రంగాలకు కూడా ఆమె మద్దతు అందిస్తున్నారు.
వివరాలు
యువత భవిష్యత్తుకు భరోసాగా ట్రావిస్ కెల్సీ
మరోవైపు ట్రావిస్ కెల్సీ సేవా కార్యక్రమాలు వ్యవస్థాగతంగా, దీర్ఘకాలిక లక్ష్యాలతో సాగుతుంటాయి.
తన 'ఎయిటీ-సెవెన్ & రన్నింగ్ ఫౌండేషన్' ద్వారా వెనుకబడిన యువతకు విద్య, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్ వంటి రంగాల్లో అవకాశాలు కల్పించడంపై ఆయన దృష్టి సారించారు.
మీరు పుట్టిన ప్రదేశం, పరిస్థితి లేదా మీ చర్మం రంగు మీ కలలపై ప్రభావం చూపకూడదు" అనేది ఆయన ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం.
ఇందులో భాగంగా కాన్సాస్ సిటీలో 'ఆపరేషన్ బ్రేక్‌త్రూ' అనే సంస్థతో కలిసి 'ఇగ్నిషన్ ల్యాబ్'ను నిర్మించారు.
ఈ ల్యాబ్ ద్వారా పేద యువతకు రోబోటిక్స్, ఆటోమోటివ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, డిజిటల్ మీడియా వంటి రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు.
వివరాలు
ఒకే లక్ష్యం.. సేవలో రెండు విభిన్న మార్గాలు
తద్వారా యువత తమ ఆసక్తిని నైపుణ్యంగా, ఆ నైపుణ్యాన్ని ఉద్యోగ అవకాశంగా మార్చుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 జులైలో ఈ జంట కలిసి 20 స్వచ్ఛంద సంస్థలకు 26 మిలియన్ డాలర్ల విరాళం అందించారు.
ఈ జాబితాలో న్యూయార్క్ ఫుడ్ బ్యాంక్, చిల్డ్రన్స్ మెర్సీ హాస్పిటల్ (కాన్సాస్ సిటీ), డాలీ పార్టన్ ఇమాజినేషన్ లైబ్రరీ, ఫీడింగ్ అమెరికా వంటి సంస్థలు ఉన్నాయి.
ఈ సంస్థల ఎంపికలో కూడా వీరిద్దరి ఆసక్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించే ఫుడ్ బ్యాంకులు, పిల్లల ఆరోగ్యం, విద్య వంటివి టేలర్ స్విఫ్ట్ ప్రాధాన్యతలుగా కనిపిస్తాయి.
వివరాలు
ఎంత మొత్తం ఇచ్చారనే వివరాలను వెల్లడించలేదు
మరోవైపు కాన్సాస్ సిటీలోని సంస్థలకు సాయం చేయడం ట్రావిస్ కెల్సీ లక్ష్యాలకు అద్దం పడుతోంది. అయితే ఏ సంస్థకు ఎంత మొత్తం ఇచ్చారనే వివరాలను వెల్లడించలేదు.
ఒకరు తక్షణ అవసరాలకు స్పందిస్తూ.. మరొకరు భవిష్యత్ తరాల కోసం పునాదులు వేస్తూ.. ఇద్దరూ సమాజ సేవలో ఒకే లక్ష్యం వైపు పయనిస్తున్నారు.
ఈ భారీ విరాళం వారి సేవా దృక్పథాన్ని మరోసారి చాటిచెబుతోంది.