వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లోకి జొకోవిచ్.. ఎనిమిదో టైటిల్ పై కన్నేసిన స్టార్ ప్లేయర్
సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ 2023లో ఎనిమిదో టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో హుర్కాజ్‌పై గెలిచాడు. మరోవైపు మెద్వెదెవ్, సిన్నెర్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన జొకోవిచ్,తన క్రీడా నైపుణ్యంతో సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. ఇప్పటికే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో 7 టైటిల్స్ సాధించిన జొకో 7-6, (8/6), 7-6 (8/6), 5-7, 6-4తో హబర్ట్ హర్కాజ్‌పై విజయ దుందుభి మోగించాడు. సింగిల్స్‌లో ఫెదరర్ మాత్రమే జొకో కంటే ముందున్నాడు. గ్రాండ్‌స్లామ్‌లో 23 టైటిల్స్ నెగ్గిన జొకో చరిత్ర సృష్టించాడు. జొకోవిచ్ 14వసారి గ్రాస్ కోర్ట్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాడు.
ప్రీక్వార్టర్స్ లో 37 తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్న హర్కాజ్
సెంటర్ కోర్ట్‌లో దాదాపు 3 గంటలకుపైగా సాగిన భీకర పోరులో 18 ఏస్‌లతో జొకోవిచ్ మూడు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. 33 ఏస్‌లతో విజృంభించిన హర్కాజ్ 37 తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. మొత్తం మీద జొకో 56వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ మేరకు క్వార్టర్స్ లో ఆండ్రీ రూబ్లేవ్‌తో తలపడనున్నాడు. వింబుల్డన్ పురుషుల డబుల్స్‌లో ఇండియన్ ప్లేయర్ రోహన్ బోపన్న ప్రిక్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. మెన్స్ డబుల్స్‌లో మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న బరిలో దిగాడు. రెండో రౌండ్‌లో 7-5, 6-3తో బ్రిటన్ ఆటగాళ్లపై గెలుపొందారు. అయితే తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న బోపన్న జోడీ రెండో సెట్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది.