LOADING...
2027 ODI World Cup Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. ఆఫ్రికాలో క్రికెట్ మహాసంగ్రామం!
వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. ఆఫ్రికాలో క్రికెట్ మహాసంగ్రామం!

2027 ODI World Cup Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. ఆఫ్రికాలో క్రికెట్ మహాసంగ్రామం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 12, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2027లో నిర్వహించనున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన తేదీలు, ఆతిథ్య వేదికల వివరాలను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. ఈ విషయాన్ని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో వెల్లడించింది. 2003 తర్వాత ఆఫ్రికా ఖండంలో వన్డే ప్రపంచకప్ నిర్వహించబడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో కథనం ప్రకారం, టోర్నీలోని ఎక్కువ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 54 మ్యాచ్‌లలో సుమారు 41 మ్యాచ్‌లు అక్కడే జరగనున్నాయి.

వివరాలు

మూడు వేదికల్లో 8 నుంచి 10 మ్యాచ్‌లు

మరోవైపు జింబాబ్వేలోని మూడు వేదికల్లో 8 నుంచి 10 మ్యాచ్‌లు నిర్వహించనుండగా, నమీబియా మూడు మ్యాచ్‌లకు వేదిక కానుంది. జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫేల్ మోసీ-ఓ-తున్యా స్టేడియం ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం కానుందని సమాచారం. ఈ ప్రపంచకప్‌లో మళ్లీ 14 జట్లు పోటీపడనున్నాయి. గత రెండు ఎడిషన్లలో 10 జట్లతో టోర్నీ నిర్వహించగా, ఈసారి పాత ఫార్మాట్‌ను తిరిగి అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.

వివరాలు

తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత

14 జట్లను ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపు నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు పూర్తిస్థాయి సభ్య దేశాల హోదా ఉండటంతో నేరుగా ప్రపంచకప్‌లో ప్రవేశం లభించనుంది. అయితే నమీబియా మాత్రం క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. 2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) పరిధిలో నిర్వహించనున్న తొలి ఐసీసీ టోర్నీగా ఈ ప్రపంచకప్ నిలవనుంది. ప్రపంచకప్ తేదీలపై మే నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చ జరిగింది.

Advertisement

వివరాలు

తుది నిర్ణయం తీసుకొనేది ఐసీసీ మాత్రమే

జులైలో ఎడిన్‌బర్గ్‌లో నిర్వహించనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో దీనికి తుది ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. అదే సమావేశంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫార్మాట్‌లో మార్పులు, అన్ని పూర్తిస్థాయి సభ్య దేశాలను ఆ టోర్నీలో భాగస్వామ్యం చేయడం వంటి కీలక అంశాలపై కూడా ఐసీసీ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement