LOADING...
IND Vs PAK: భారత్‌తో ఆడతాం.. ప్రకటించిన పాకిస్థాన్
భారత్‌తో ఆడతాం.. ప్రకటించిన పాకిస్థాన్

IND Vs PAK: భారత్‌తో ఆడతాం.. ప్రకటించిన పాకిస్థాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఈ మ్యాచ్‌ జరగనుందని పాకిస్థాన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన పరిణామాలతో తాము సంతృప్తి చెందినట్లు, అలాగే మిత్ర దేశాల విజ్ఞప్తుల నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 15న కొలంబోలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు, ఐసీసీ మధ్య చర్చలు సాగాయి.

వివరాలు 

షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడిన శ్రీలంక ప్రధాని

భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పునరాలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డులు పీసీబీని కోరినట్లు సమాచారం. అలాగే భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని పాకిస్థాన్‌ను తాను విజ్ఞప్తి చేసినట్లు బీసీబీ అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లామ్‌ వెల్లడించారు. శ్రీలంక ప్రధాని అనుర కుమార పాక్‌ ప్రధాని షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా,పాకిస్థాన్‌,భారత్‌,బంగ్లాదేశ్‌లతో ముక్కోణపు సిరీస్‌ నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది.

వివరాలు 

బంగ్లాదేశ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించబొం 

ప్రపంచకప్‌కు దూరమైన కారణంగా బంగ్లాదేశ్‌కు వచ్చిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ఈ సిరీస్‌ను ప్రతిపాదించినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని కూడా పీసీబీ కోరింది. అయితే అది ఐసీసీ పరిధిలో లేని అంశమని స్పష్టం చేసింది. అయినప్పటికీ, వచ్చే అండర్‌-19 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్‌కు ఇవ్వాలనే అంశాన్ని ఐసీసీ పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు నిరాకరించినందుకు బంగ్లాదేశ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని ఐసీసీ స్పష్టంచేసింది.

Advertisement