PCB: ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు జట్టు ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ జట్టును ఐసీసీ (ICC) తప్పించిన నేపథ్యంలో, పాకిస్థాన్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందన్న ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అయితే, ఐసీసీ నుంచి వచ్చిన కఠిన హెచ్చరికల కారణంగా పీసీబీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఫలితంగా పొట్టి ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా పాక్ జట్టుకు బాధ్యతలు అప్పగించారు. ఈ జట్టులోకి బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిది తిరిగి చోటు దక్కించుకోగా, ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్‌ను ఎంపిక చేయలేదు.
Details
ఆ దేశంపై కఠిన ఆంక్షలు
బంగ్లాదేశ్‌ను మెగా టోర్నీ నుంచి తప్పించిన నేపథ్యంలో పాకిస్థాన్ కూడా టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతుందా అన్న చర్చ మొదలైంది. దీనిపై పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి స్పందిస్తూ ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్నే మేం పాటిస్తాం. ఒకవేళ ప్రభుత్వం ఆడొద్దని చెబితే, ఐసీసీ మరో జట్టును ఆహ్వానించవచ్చని నఖ్వి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ పాకిస్థాన్ కూడా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే, ఆ దేశ క్రికెట్‌పై కఠిన ఆంక్షలు విధించేందుకు ఐసీసీ సిద్ధమైందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పాకిస్థాన్ మెగా టోర్నీకి తమ జట్టును ప్రకటించింది.