
Asia Cup: చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై పాక్ విజయం.. సూపర్-4కు దాయాది
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ టీ20 టోర్నీలో సూపర్-4లోకి చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కొంత తడబడినా చివరికి విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన ఈ పోరులో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో యూఏఈపై గెలిచి ముందంజ వేసింది. ఇప్పటికే గ్రూప్-ఎ నుంచి భారత్ సూపర్-4లోకి అర్హత సాధించగా, రెండో బెర్తు కోసం పాక్, యూఏఈల మధ్య పోటీ నెలకొంది. కాబట్టి ఈ చివరి మ్యాచ్ గెలిచిన జట్టుకే సూపర్-4లో చోటు దక్కే పరిస్థితి నెలకొంది.
వివరాలు
సిమ్రన్‌జీత్ సింగ్ ధాటికి కష్టాల్లో పాకిస్థాన్
టాస్ ఓడిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్‌కి దిగింది.అయితే ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బౌలర్ జునైద్ సిద్ధిఖ్ (4/18) సంచలన ప్రదర్శన చేస్తూ, ఓపెనర్లు సైమ్ అయూబ్ (0),సాహిబ్‌జాదా ఫర్హాన్ (5)లను తొలివరస ఓవర్లలోనే పెవిలియన్‌కి పంపించాడు. దీంతో పాక్ స్కోరు 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.ఈ దశలో ఫకార్ జమాన్ (50;36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు),సల్మాన్ అఘా (20)క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను నిలదొక్కుకునేలా చేశారు. కానీ వీళ్లిద్దరూ ఔటయ్యాక పాకిస్థాన్ మళ్లీ కష్టాల్లో పడింది.భారత సంతతి స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ (3/26) ధాటికి 93/6తో కష్టాల్లో పడింది.
వివరాలు
మొదటి నుంచే ఒత్తిడికి లోనైన పాకిస్థాన్
అయినా చివర్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోలాగే షహీన్ అఫ్రిది (29 నాటౌట్; 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో ధాటిగా ఆడి పాకిస్థాన్ స్కోరును గౌరవప్రద స్థాయికి తీసుకెళ్లాడు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో యూఏఈ ఇన్నింగ్స్ మొదటి నుంచే ఒత్తిడికి లోనై 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్లలోనే వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 37/3కి చేరుకుంది.ఈ సమయంలో రాహుల్ చోప్రా(35), ధ్రువ్ పరాషర్ (20)కొంతవరకు ప్రతిఘటించారు. కానీ వీళ్లిద్దరూ అవుట్ అయిన తరువాత యూఏఈ జట్టు నిలువలేకపోయింది.
వివరాలు
షహీన్ అఫ్రిదికే 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'
పాకిస్థాన్ బౌలర్లు అబ్రార్ అహ్మద్ (2/13), షహీన్ అఫ్రిది (2/16), హారిస్ రవూఫ్ (2/19 ) వరుస వికెట్లు తీయడంతో యూఏఈ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. చివరికి తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన షహీన్ అఫ్రిదికే 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.