Pakistan Vs Namibia: పాక్ జట్టులో విభేదాలు.. సీనియర్లపై కోచ్-పీసీబీ భిన్నాభిప్రాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు నమీబియాతో జరగనున్న కీలక పోరుకు ముందు పాకిస్థాన్ జట్టులో మార్పులపై ఉత్కంఠభరితమైన చర్చ కొనసాగుతోంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలా? లేక పూర్తిస్థాయి బలంతోనే బరిలోకి దిగాలా? అన్న అంశంపై జట్టు మేనేజ్‌మెంట్‌లో స్పష్టమైన ఏకాభిప్రాయం కనిపించడం లేదు. అయితే హెడ్ కోచ్ మైక్ హెసెన్ మాత్రం అనుభవజ్ఞులనే కొనసాగించాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు పీసీబీకి చెందిన కొందరు అధికారులు మాత్రం సీనియర్‌లను పక్కన పెట్టాలనే అభిప్రాయంతో ఉన్నారట. నమీబియాతో జరిగే ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లైన బాబర్ ఆజామ్, షాహిన్ షా ఆఫ్రిది, షాబాద్ ఖాన్ తప్పకుండా ఆడాలని హెసెన్ భావిస్తున్నాడని తెలుస్తోంది.
వివరాలు
పాకిస్థాన్ తుది జట్టు ఎంపికపై ఆసక్తి
గత మ్యాచ్‌లో టీమిండియాపై నిరాశాజనక ప్రదర్శన ఎదురైనా, అనుభవమే జట్టుకు అసలైన బలం అని కోచ్ నమ్మకం. అయితే పీసీబీ మేనేజ్‌మెంట్ మాత్రం ఈ ముగ్గురి స్థానాల్లో ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో పాకిస్థాన్ తుది జట్టు ఎంపికపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదిలా ఉంటే, ఫఖర్ జమాన్ కు ఓపెనర్‌గా అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఫాస్ట్ బౌలర్ నజీమ్ షా కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
సీనియర్ ఆటగాళ్లపైనే నమ్మకం పెట్టుకోవాలన్నదే కోచ్ హెసెన్ అభిప్రాయం
మరోవైపు యువ ఆటగాళ్లైన సాహిబ్జాదా ఫర్హాన్, అబ్రార్ అహ్మద్ తుది జట్టులో స్థానం కోల్పోయే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తం మీద ఇటీవలి ఫలితాలు ఆశించినంతగా లేకపోయినా, సీనియర్ ఆటగాళ్లపైనే నమ్మకం పెట్టుకోవాలన్నదే కోచ్ హెసెన్ అభిప్రాయంగా కనిపిస్తోంది. మరి నమీబియాతో మ్యాచ్‌కు పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందన్నది వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాక్ జట్టు సూపర్-8 దశకు చేరుకుంటుంది.