భారత్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడనన్న పాక్.. లంకలో అయితే ఓకే!
2023 జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు లేనట్లే అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఐసీసీ షెడ్యుల్ ప్రకారం భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్, పాకిస్థాన్ లో ఆసియా కప్ టోర్నమెంట్‌లు జరగాల్సి ఉంది. ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తో చర్చలు జరుపుతున్నాయి. పాక్ లో ఆసియా కప్ ను నిర్వహిస్తే టీమిండియా అక్కడికి రాదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్ లో తటస్థ వేదికలపైనే తాము ఆడతామని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇప్పటికే స్పష్టం చేశారు.
తటస్థ వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించాలి
కాకపోతే ప్రపంచ కప్ లో ఆడేందుకు వీరు ఓ కొత్త షరతులను పెట్టారు. పాక్ టీం కూడా వన్డే వరల్డ్ కప్‌లో తాము ఆడాల్సిన మ్యాచ్ లను బంగ్లాదేశ్ లేదా శ్రీలంక దేశాల్లోని మైదానాల్లోని నిర్వహించాలంటూ షరతును విధించినట్లు తెలిసింది. ఒకవేళ బీసీసీఐ తమ జట్టును ఆసియా కప్ కోసం పాక్ కు పంపించకపోతే తాము కూడా ప్రపంచ కప్ మ్యాచ్ ల కోసం భారత్ కు రామని, తమకు కూడా తటస్థ వేదికలపైనే నిర్వహిస్తే వస్తామని చెబుతున్నట్లు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఐసీసీ, బీసీసీఐ మాత్రం దీనికి ఒప్పుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.