Paris Olympics 2024: ఒలింపిక్స్ లో పతకాలను గెలుచుకున్న భారత అథ్లెట్లు వీరే..
పారిస్ ఒలింపిక్స్ 2024 శుక్రవారం (జులై 26) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు మొత్తం 5,084 పతకాల కోసం పోటీపడనున్నారు. ఈసారి, భారతదేశం నుండి 117 మంది అథ్లెట్లతో కూడిన బృందం ఒలింపిక్స్‌కు వెళ్లింది. అందులో 70 మంది అథ్లెట్లు మొదటిసారి ఒలింపిక్స్‌లో కనిపించనున్నారు. అదేవిధంగా ఇప్పటికే 47 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుత జట్టులో ఉన్న ఏ అథ్లెట్లు ఇప్పటికే ఒలింపిక్ పతకాలను గెలుచుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆటగాళ్లు వ్యక్తిగత పతకాలు సాధించారు
ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 35 పతకాలు సాధించింది. వీటిలో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుత భారత ఒలింపిక్ జట్టులో చేరిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ 2020లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అదే విధంగా మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మహిళా బాక్సర్ లోవ్లినా బోరెగోహైన్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా సింధు రజత పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం
టీమ్ ఈవెంట్‌లో భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మళ్లీ పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీ జట్టు అత్యధికంగా 12 పతకాలు (స్వర్ణం-8, రజతం-1, కాంస్య-3) సాధించింది. భారత హాకీ జట్టు 1928 నుండి 1956 మధ్య ఒలింపిక్స్‌లో వరుసగా 6 బంగారు పతకాలు సాధించి రికార్డు సృష్టించింది.