LOADING...
Pawan Kalyan: ప్రపంచకప్‌ గెలిచిన మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్‌ కళ్యాణ్ ఘన సన్మానం
ప్రపంచకప్‌ గెలిచిన మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్‌ కళ్యాణ్ ఘన సన్మానం

Pawan Kalyan: ప్రపంచకప్‌ గెలిచిన మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్‌ కళ్యాణ్ ఘన సన్మానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కప్ విజయం సాధించి భారతకు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ప్రత్యేకంగా సన్మానించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయిలో కీర్తి సాధించిన ఈ క్రీడాకారిణులను పవన్‌ కళ్యాణ్ అభినందిస్తూ, వారి ప్రతిభను దేశ గౌరవంగా పేర్కొన్నారు. జట్టులో ప్రతి క్రీడాకారిణికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులు, కోచ్‌లకు రూ.2 లక్షల చొప్పున ప్రోత్సాహకాలను అందజేశారు. అదనంగా ప్రతి ప్లేయర్‌కు పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, అరకు కాఫీ, కొండపల్లి బొమ్మలతో ప్రత్యేక బహుమతులు అందించారు.

Details

ప్రత్యేక సదుపాయాల ఏర్పాటుకు సన్మాహాలు

అంధ మహిళా క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమని పవన్‌ కళ్యాణ్ ప్రశంసించారు. ఇలాంటి క్రీడల అభ్యాసం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను తానే స్వయంగా కోరుతానని తెలిపారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా జట్టు ప్రతినిధులు వివరించిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విజేతల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ దీపిక, కరుణా కుమారి ఉన్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు పవన్‌ కళ్యాణ్.

Details

దేశానికి గర్వకారణం

ఈ సందర్భంగా కెప్టెన్ దీపిక తమ గ్రామం శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాకు రహదారి అవసరాన్ని వివరించగా, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చిన కరుణా కుమారి తెలిపిన సమస్యల పైనా తక్షణ చర్యలు ప్రారంభించాలని సూచించారు. దేశానికి గర్వకారణమైన ఈ విజేతల జట్టును ప్రోత్సహిస్తూ, క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం సంకల్పాన్ని పవన్‌ కల్యాణ్‌ మరోసారి పునరుద్ఘాటించారు.

Advertisement