PBKS vs LSG: భారీ స్కోరును చేధించలేకపోయిన పంజాబ్
పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట లక్నో బ్యాటర్ల ధాటికి మొహాలీలో పరుగుల వరద పారింది. లక్నోకు ఓపెనర్ మేయర్స్ (54) మెరుపు ఇన్నింగ్స్ తో అదిరే ఆరంభాన్ని అందించాడు. అనంతరం బదోని(43), స్టోయినిస్(72), పూరన్ (45) ఏమాత్రం తగ్గేదేలా అంటూ పంజాబ్ బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించడంతో లక్నో 257 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక స్కోరును కావడం విశేషం. పంబాజ్ బౌలర్లలో రబడ(2), సామ్ కర్రన్, లివింగ్ స్టోన్,ఆర్షదీప్ సింగ్ తలా ఓ వికెట్ తీశారు.
నాలుగు వికెట్లతో చెలరేగిన యశ్ ఠాకూర్
బ్యాటింగ్ దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయం తర్వాత బరిలోకి దిగిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్(1) స్టోయినిస్ బౌలింగ్ లో ఔట్ కాగా..ప్రభుమాన్ సింగ్ (9) పరుగులతో నిరాశ పరిచాడు. అథర్వ తైదే (66), సికిందర్ (36), లివింగ్ స్టోన్ (23) పరుగులు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 19.5 ఓవర్లలో 201 పరుగులు చేసి పంజాబ్ ఆలౌటైంది. లక్నో బౌలర్లలో యాశ్ ఠాకూర్(4), నవీన్ హుల్ హుక్ (3), రవి బిష్టోణ్(2), స్టోయినిస్ 1 వికెట్ తీశారు.