PCB: ఓటములు వెంటాడుతున్నా... పాక్ క్రికెటర్లకు భారీ వేతనాల వరం!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ, అక్కడి క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆటగాళ్ల వేతనాలు, మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న సంప్రదాయ కేటగిరీ విధానానికి స్వస్తి పలికిన పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ, తొలిసారిగా ఆటగాళ్లకు ఫార్మాట్ ఆధారిత కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆదరణ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్‌కు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో రెడ్‌బాల్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు కొత్త వేతన విధానంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు.
వివరాలు
గతంతో పోలిస్తే రెట్టింపు మ్యాచ్ ఫీజు..
కొత్త విధానం ప్రకారం కేవలం టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడే అగ్రశ్రేణి ఆటగాళ్లను 'ట్రాక్-ఏ' విభాగంలో చేర్చారు. ఈ కేటగిరీలో ఉన్న వారికి నెలకు సుమారు 40 లక్షల పాకిస్థానీ రూపాయల రిటైనర్ అందనుంది. అంతేకాదు, ఇప్పటివరకు 8 లక్షలుగా ఉన్న ఒక్కో టెస్ట్ మ్యాచ్ ఫీజును 15 లక్షల పాకిస్థానీ రూపాయలకు పెంచారు. దీంతో ఆటగాళ్లు గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు మ్యాచ్ ఫీజును పొందనున్నారు. అదేవిధంగా టెస్ట్‌లు, వన్డేలు రెండింటిలోనూ ప్రాతినిధ్యం వహించే సీనియర్ ఆటగాళ్లను 'ట్రాక్-ఏబీ' కేటగిరీలో చేర్చారు. ఈ విభాగంలో ఉన్న క్రికెటర్లకు నెలకు గరిష్ఠంగా 50 లక్షల పాకిస్థానీ రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉంది.
వివరాలు
ఒక్కో ఆటగాడికి ఏడాదికి రూ.5 కోట్లకు పైగా ఆదాయం..
ఫలితంగా మ్యాచ్ ఫీజులను పక్కనబెడితే, కేవలం వార్షిక కాంట్రాక్ట్ ద్వారానే ఒక్కో ఆటగాడు ఏడాదికి 5 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం పొందే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు దూరం కాకుండా ప్రోత్సహించడమే ఈ భారీ వేతనాల పెంపు వెనుక ప్రధాన ఉద్దేశమని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ కొత్త కాంట్రాక్టులు పొందాలంటే ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పాల్గొనాల్సి ఉంటుందని, అలా చేయని వారికి కాంట్రాక్టులు ఇవ్వబోమని పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ స్పష్టం చేశారు.
వివరాలు
ఫీజుపై 300 శాతం అదనపు బోనస్..
ఇక జట్టు విజయాలను మరింత ప్రోత్సహించేలా పీసీబీ ప్రత్యేక బోనస్ విధానాన్ని కూడా ప్రకటించింది. ఈ విధానం ప్రకారం పాకిస్థాన్ జట్టు ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌ను కైవసం చేసుకుంటే, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుపై అదనంగా 500 శాతం బోనస్ అందజేస్తారు. అదే ఆసియా కప్ వంటి ఖండస్థాయి టోర్నమెంట్‌లలో విజేతగా నిలిస్తే, మ్యాచ్ ఫీజుపై 300 శాతం అదనపు బోనస్ చెల్లించనున్నట్లు బోర్డు ప్రకటించింది.