BCCI: టీమిండియాకు ఫైన్ మాఫీ కోసం ఫోన్ కాల్..! బీసీసీఐపై క్రిస్ బ్రాడ్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ బీసీసీఐపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనాన్ని రేపుతున్నాయి. ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, భారత క్రికెట్ బోర్డు (BCCI) తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, క్రికెట్‌లో రాజకీయాలు నడుపుతోందని ఆరోపించారు. ముఖ్యంగా ఓ మ్యాచ్ సందర్భంగా టీమిండియాకు విధించాల్సిన స్లో ఓవర్ రేట్ ఫైన్‌ను తప్పించాలంటూ తనకు ఫోన్ కాల్ వచ్చిన ఘటనను బయటపెట్టారు.
Details
స్లో ఓవర్ రేట్ వివాదం
క్రిస్ బ్రాడ్ 'ది టెలిగ్రాఫ్'తో మాట్లాడుతూ, ఒకసారి టీమిండియా నిర్దిష్ట సమయం లోపు బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో మూడు లేదా నాలుగు ఓవర్లు వెనుకబడిందని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆ జట్టుకు ఫైన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయితే అదే సమయంలో తాను ఒక ఫోన్ కాల్ అందుకున్నానని పేర్కొన్నారు. ఇది ఇండియా... వదిలేయండి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి, 'ఇది ఇండియా జట్టు.. కాబట్టి చూసి చూడనట్టు వదిలేయండి' అని అన్నాడు. ఆ తర్వాత నాకు ఆదేశాల ప్రకారం టైమ్ సర్దుబాటు చేసి, టీమిండియా నిర్దిష్ట సమయానికే ఓవర్లు పూర్తి చేసినట్టు రిపోర్ట్ చేయాల్సి వచ్చిందని క్రిస్ బ్రాడ్ తెలిపారు.
Details
గంగూలీతో ఘటన
తర్వాతి మ్యాచ్‌లో కూడా టీమిండియా స్లో ఓవర్ రేట్ తప్పు పునరావృతం చేసిందని ఆయన చెప్పారు. ఆ సమయంలో కెప్టెన్ సౌరభ్ గంగూలీకి బీసీసీఐ నుంచి హెచ్చరిక ఉన్నప్పటికీ, ఆయన పట్టించుకోలేదు. నేను మళ్లీ పై అధికారులను సంప్రదించగా, 'మీకే ఫోన్ చేసిన వారిని మళ్లీ సంప్రదించాలని చెప్పారని బ్రాడ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో ఇప్పటి కుర్రాళ్లు మరింత రాజకీయ అవగాహనతో ఉన్నారు. క్రికెట్‌లో రాజకీయాలు కొత్తవి కావు, అవి అప్పుడే మొదలయ్యాయని అన్నారు.
Details
బీసీసీఐ ఐసీసీని ఆధీనంలోకి తెచ్చుకుంది
క్రిస్ బ్రాడ్ ప్రకారం, బీసీసీఐ వద్ద ఉన్న ఆర్థిక శక్తి కారణంగా అది ఇప్పుడు ఐసీసీపై ప్రభావం చూపుతోందని అన్నారు. "బీసీసీఐకి డబ్బు ఉంది. అది ఇప్పుడు ఐసీసీని పరోక్షంగా స్వాధీనం చేసుకుంది. నేను ఇప్పుడు ఆ వ్యవస్థలో లేనందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో రాజకీయాలను చూసానని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్‌లో 123 టెస్టులకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్, చివరిసారిగా 2024లో ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో బీసీసీఐ ప్రాబల్యం, ఐసీసీ రాజకీయాలపై మళ్లీ చర్చ తెరపైకి తెచ్చాయి.