T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ కి ముందు గాయపడిన ఆటగాళ్ళు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పీక్‌కి చేరుతోంది. గత ఎడిషన్ తరహాలోనే ఈసారి కూడా మొత్తం 20జట్లు పాల్గొననున్నాయి. వీటిని ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం నాకౌట్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే, మెగా టోర్నీకి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, గాయాల కారణంగా కొన్ని జట్లు తమ ఫామ్‌లో ఉన్న కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. ఇప్పటికీ కొన్ని జట్లు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా,భారత్ జట్లలో కీలక ప్లేయర్ల ఆరోగ్య పరిస్థితిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో,గాయాలు,ఫిట్‌నెస్ సమస్యల కారణంగా 2026 టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే ఆటగాళ్ల జాబితా ఇదే.
వివరాలు
ఆఫ్ఘానిస్థాన్: ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్
ఆఫ్ఘానిస్థాన్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఈ టోర్నీకి దూరం కానున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మంచి ప్రదర్శనతో ముందుకెళ్తున్న ఆఫ్ఘాన్ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. నవీన్ ఉల్ హక్‌కు కుడి భుజంలో స్ట్రెస్ ఫ్రాక్చర్ ఏర్పడడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనుంది. అతని స్థానంలో జియా ఉర్ రహ్మాన్ షరీఫీని జట్టులోకి తీసుకున్నారు.
వివరాలు
న్యూజిలాండ్ : పేసర్ అడమ్ మిల్నే
న్యూజిలాండ్ జట్టుకూ షాక్ తగిలింది. బ్లాక్ క్యాప్స్ పేసర్ అడమ్ మిల్నే హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. SA20 2025-26 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరఫున ఆడుతూ ఈ గాయానికి గురయ్యాడు. మిల్నే స్థానంలో కైల్ జేమిసన్‌ను ఎంపిక చేయడంతో న్యూజిలాండ్ బౌలింగ్ దళానికి కొత్త బలం చేకూరినట్టైంది.
వివరాలు
దక్షిణాఫ్రికా : డొనోవన్ ఫెరెయిరా,టోనీ డి
దక్షిణాఫ్రికా జట్టుకూ భారీ దెబ్బే తగిలింది.డొనోవన్ ఫెరెయిరా, టోనీ డి జార్జి ఇద్దరూ గాయాల కారణంగా రానున్న టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యారు. SA20 2025-26 సమయంలో ఫెరెయిరాకు ఎడమ క్లావికిల్ ఎముకకు గాయం కాగా, టోనీ డి జార్జి కుడి హామ్‌స్ట్రింగ్‌లో టియర్‌తో బాధపడుతున్నాడు. ఇవే కాకుండా మరికొన్ని జట్లు తమ కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్,సీనియర్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది. ఇక డిఫెండింగ్ చాంపియన్స్ భారత్‌కూ ఇటీవల గాయాల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. వాషింగ్టన్ సుందర్,తిలక్ వర్మ గాయాల కారణంగా జట్టులో ఆందోళన నెలకొంది. టోర్నీ ప్రారంభానికి ముందు వీరి ఫిట్‌నెస్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.