Prabath Jayasuriya: జయసూర్యతో జరభద్రం.. టీమిండియాకు అసలైన సవాల్ అతడే!
ఈ వార్తాకథనం ఏంటి
సనత్ జయసూర్య.. ఒకప్పుడు టీమిండియా తన విధ్వంసక బ్యాటింగ్‌తో వణికించిన శ్రీలంక క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా సరే.. ఎలాంటి బౌలింగ్‌నైనా అలవోకగా ఎదుర్కొంటూ చెలరేగిపోయేవాడు ఈ ఎడమచేతి వాటం ఓపెనర్. అయితే ఇప్పుడు భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు మరో జయసూర్య సిద్ధమయ్యాడు. కాకపోతే అతడు బ్యాటర్ కాదు.. బౌలర్. అతడి పూర్తి పేరు ప్రభాత్ జయసూర్య. కొన్నేళ్లుగా శ్రీలంక స్పిన్ భారాన్ని మోస్తున్న ప్రభాత్.. సొంతగడ్డపై ప్రత్యర్థి బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. రాబోయే రెండు టెస్టుల సిరీస్‌లో భారత బ్యాటర్లకు అతడి రూపంలో గట్టి సవాల్ ఎదురుకానుంది.
వివరాలు
బలహీనంగా స్పిన్ బలం..
ముత్తయ్య మురళీధరన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత శ్రీలంక స్పిన్ బలం కొంత బలహీనపడింది.
అయినప్పటికీ సొంతగడ్డపై స్పిన్ ఆ జట్టుకు ప్రధాన ఆయుధంగానే కొనసాగుతోంది.
ముఖ్యంగా టెస్టుల్లో శ్రీలంక స్పిన్నర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.
అయితే కొంతకాలం పాటు ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్ అంటూ ఎవరూ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ప్రభాత్ జయసూర్య రాకతో ఆ లోటు తీరింది. 30ఏళ్ల వయసులో 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ప్రభాత్.. ఇప్పటివరకు 23 టెస్టులు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు.
అందులో ఎక్కువ వికెట్లు సొంతగడ్డపైనే సాధించాడు. గాలె మైదానంలో అతడికి తిరుగులేని రికార్డు ఉంది.
ఈ వేదికపై ఏకంగా 81 వికెట్లు తీసిన ప్రభాత్.. 'కింగ్ ఆఫ్ గాలె'గా పేరు తెచ్చుకున్నాడు.
వివరాలు
భారత బ్యాటర్లకు కష్టాలు..
ఇదే గాలె మైదానంలో ఈ నెల 15 నుంచి భారత్, శ్రీలంక తొలి టెస్టు జరగనుంది.
దీంతో తనకు కొట్టిన పిండి లాంటి గాలె పిచ్‌పై ప్రభాత్ భారత బ్యాటర్లకు పెద్ద సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత బ్యాటర్లకు ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కొంత బలహీనత ఉందనే అభిప్రాయం ఉంది.
గతంలో శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్ కూడా టీమ్‌ఇండియాను ఇబ్బంది పెట్టాడు.
ప్రభాత్ బౌలింగ్ శైలి న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ను పోలి ఉంటుంది. ఎక్కువగా ఫ్లైటెడ్ డెలివరీలు వేస్తూ బ్యాటర్లను ఉచ్చులోకి లాగుతాడు.
బంతిని బాగా స్పిన్ చేయగలడు. ప్రభాత్‌ను కేవలం రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రయత్నిస్తే భారత బ్యాటర్లకు కష్టాలు తప్పకపోవచ్చు.
వివరాలు
వ్యూహాత్మకంగా ఆడటం టీమిండియా బ్యాటర్లకు కీలకం..
మాజీ ఆటగాడు అజింక్య రహానె చెప్పినట్లుగా.. స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో బ్యాటర్లు సానుకూల దృక్పథంతో ఆడాల్సి ఉంటుంది.
గాలెలో గాలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితులను ప్రభాత్ తనకు అనుకూలంగా మలుచుకుంటూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు.
అందుకే పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు ప్రభాత్ బౌలింగ్ శైలిపై అవగాహన పెంచుకుని వ్యూహాత్మకంగా ఆడటం టీమిండియా బ్యాటర్లకు కీలకం కానుంది.
ప్రస్తుత భారత జట్టులో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలరని అంచనా.
అయితే యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ వంటి యువ బ్యాటర్లకు ఇది అసలైన పరీక్షే.