Loading...
Praggnanandhaa: ప్రజ్ఞానంద గ్రాండ్‌ విజయం.. ఫైనల్లో కరువానాపై గెలుపు
ప్రజ్ఞానంద గ్రాండ్‌ విజయం.. ఫైనల్లో కరువానాపై గెలుపు

Praggnanandhaa: ప్రజ్ఞానంద గ్రాండ్‌ విజయం.. ఫైనల్లో కరువానాపై గెలుపు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద (Praggnanandhaa) అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరువానాపై 15-13 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో నార్వే చెస్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన ప్రజ్ఞానంద.. ఇప్పుడు గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా మరో ఘనతను అందుకున్నాడు. ఫైనల్లో తొలి రెండు క్లాసికల్‌ గేమ్‌లు ముగిసేసరికి ప్రజ్ఞానంద 3-9తో వెనుకబడ్డాడు. దీంతో టైటిల్‌ సాధించడం అతడికి కష్టమేనని అనిపించింది. అయితే శుక్రవారం జరిగిన ర్యాపిడ్‌ గేమ్‌లలో ప్రజ్ఞ అద్భుతంగా పుంజుకున్నాడు.

వివరాలు

ఆఖరి గేమ్‌ను డ్రాగా ముగించి ఛాంపియన్‌గా అవతారం..

ఒక్కో విజయానికి నాలుగు పాయింట్లు లభించే ఈ రెండు గేమ్‌ల్లోనూ పైచేయి సాధించి 11-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత బ్లిట్జ్‌ గేమ్‌ల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

తొలి బ్లిట్జ్‌ గేమ్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో కరువానా విజయం సాధించాడు. దీంతో స్కోరు 12-12తో సమమైంది.

టైటిల్‌ ఎవరి సొంతమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో ప్రజ్ఞానంద కీలకమైన తదుపరి గేమ్‌లో విజయం సాధించి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు.

చివరి బ్లిట్జ్‌ గేమ్‌లో కరువానా గెలిస్తే మ్యాచ్‌ టై అయ్యేది. అప్పుడు మరో రెండు గేమ్‌లు ఆడాల్సి వచ్చేది.

అయితే ప్రజ్ఞానంద ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆఖరి గేమ్‌ను డ్రాగా ముగించి ఛాంపియన్‌గా అవతరించాడు.

వివరాలు

ప్రజ్ఞానందకు రూ.1.91 కోట్ల నగదు బహుమతి..

ఈ విజయంతో ప్రజ్ఞానందకు రూ.1.91 కోట్ల నగదు బహుమతి లభించింది.

అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే గ్రాండ్‌ చెస్‌ టూర్‌లోనూ తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.

మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోరులో అమెరికా ఆటగాడు వెస్లీ సో 18-12తో జర్మనీకి చెందిన విన్సెంట్‌ కీమర్‌ను ఓడించాడు.

ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన కరువానా, మూడో స్థానంలో నిలిచిన వెస్లీ సో కూడా వచ్చే ఏడాది గ్రాండ్‌ చెస్‌ టూర్‌కు అర్హత సాధించారు.

''నిజానికి నాకు విజయావకాశాలు ఉన్నాయని అనుకోలేదు. కానీ రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు గెలవడం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది'' అని విజయం అనంతరం ప్రజ్ఞానంద చెప్పాడు.

ADVERTISEMENT