PBSK Owner Preity Zinta: స్టేడియంలో కనిపించని ప్రీతి జింటా.. అసలు విషయం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నప్పటికీ, జట్టు యజమాని బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనిపై తాజాగా ఆమె స్పందించి అభిమానుల సందేహాలకు స్పష్టత ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ విజయాల జోరు కొనసాగుతుండటంతో, ప్రీతి జింటా జట్టుకు 'లక్కీ చార్మ్' అని అభిమానులు భావిస్తున్నారు. గత సీజన్లలో ఆమె ప్రతి మ్యాచ్‌కు హాజరై గ్యాలరీలో ఉత్సాహంగా కనిపిస్తూ ఆటగాళ్లను ప్రోత్సహించేవారు. అయితే ఈసారి జట్టు వరుస విజయాలు సాధిస్తున్నా ఆమె స్టేడియంలో కనిపించకపోవడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు.
వివరాలు
పిల్లలతో కలిసి విహారయాత్ర
"జట్టు ఇంత బాగా ఆడుతుంటే ప్రీతి జింటా ఎక్కడ?" అంటూ X, ఇన్‌స్టాగ్రామ్ వేదికలపై చర్చ జరిగింది. ఈ విమర్శలకు స్పందించిన ప్రీతి జింటా అసలు కారణాన్ని వెల్లడించారు. షూటింగ్స్, వ్యాపార పనుల కారణంగా తన పిల్లలు జై, జియాకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం వారి స్కూల్ సెలవులు కావడంతో ఈ సమయాన్ని పూర్తిగా వారితో గడపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి విహారయాత్రలో ఉన్నారని సమాచారం. అయితే లీగ్ చివరి దశ లేదా కీలక ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌లకు తాను తప్పకుండా స్టేడియానికి వచ్చి జట్టును ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు.
వివరాలు
వరుస విజయాలతో జోరు మీద ఉన్న పంజాబ్
ఇంటి నుంచే మ్యాచ్‌లు చూస్తున్నానని, జట్టు వరుస విజయాలు సాధించడం చూసి ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ప్రీతి జింటా ఇచ్చిన స్పష్టతతో పంజాబ్ అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లిగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ, త్వరలోనే స్టేడియంలో కనిపించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ప్లే-ఆఫ్స్ రేసులో ముందంజలో ఉండటంతో, కీలక మ్యాచ్‌లలో ఆమె హాజరు జట్టుకు మరింత ఉత్సాహం ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.