Page Loader
చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. వన్డే మ్యాచులో భారీ డబుల్ సెంచరీ
డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా

చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. వన్డే మ్యాచులో భారీ డబుల్ సెంచరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2023
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా కొత్త చరిత్రను సృష్టించారు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఈ ముంబై ఆటగాడు కౌంటీల్లో చెలరేగుతున్నాడు. ఇంగ్లీష్ టోర్నమెంట్ రాయల్ లండన్ వన్డే కప్ 2023లో షా డబుల్ సెంచరీ చేసి అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. పృథ్వీ షా 153 బంతుల్లో ( 28 ఫోర్లు, 11 సిక్సర్లు) 244 పరుగులు చేసి చెలరేగిపోయాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో నార్తాంప్టన్ షైర్ తరుపున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో పృథ్వీకిది ఇది రెండో ద్విశతకం కావడం గమనార్హం.

Details

లిస్ట్ ఏ క్రికెట్లో రెండు డబుల్ సాధించిన పృథ్వీ షా

ఇంగ్లండ్ లిస్ట్-ఎ క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఆరో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా షా నిలిచాడు. అదే విధంగా లిస్ట్ ఏ క్రికెట్ లో రెండు వేర్వేరు దేశాల్లో (ఇండియా, ఇంగ్లండ్) డబుల్ సెంచరీ సాధించిన ఏకైకా ఆటగాడిగా పృథ్వీ షా చరిత్రకెక్కాడు. 2020-21 లో విజయ్ హజరే ట్రోఫీలో భాగంగా ముంబై తరుపున 227 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ విషయానికొస్తే, పృథ్వీ సూపర్‌ ఇన్నింగ్స్‌తో నార్తాంప్టన్‌షైర్‌ 50 ఓవర్లలో 415/8తో భారీస్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో సోమర్‌సెట్‌ 41.4 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది.