IND Vs NZ: ఈ బంతికి ఏమైంది?.. భారత్ బౌలింగ్ వైఫల్యంపై ప్రశ్నలు!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ భారత జట్టు బౌలింగ్‌లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సొంతగడ్డపైనే ఆడుతున్నామా అన్న సందేహం కలిగించేలా భారత బౌలర్ల ప్రదర్శన సాగింది. పేస్‌లోనూ, స్పిన్‌లోనూ ప్రభావం పూర్తిగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాదే వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో నాణ్యత లేని భారత బౌలింగ్ పెద్ద హెచ్చరికగా మారింది.
Details
సొంతగడ్డపై షాక్
ఒకప్పుడు స్వదేశంలో ఆడితే టీమిండియా తిరుగులేని ఫేవరెట్. అందుకే భారత్‌లో వన్డేల్లో కివీస్ ఎప్పుడూ సిరీస్ గెలవలేకపోయారు. ఈసారి కూడా అందరూ భారత జట్టే గెలుస్తుందని భావించారు. కానీ పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన న్యూజిలాండ్ భారత్‌లో తొలిసారి వన్డే సిరీస్‌ను చేజిక్కించుకుంది. బ్యాటింగ్ వైఫల్యాలున్నా, పరాభవానికి ప్రధాన కారణం బౌలింగ్‌నేనని స్పష్టమైంది. భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను కాస్త అయినా భయపెట్టలేకపోయారు. సిరీస్‌లో ఓవర్‌కు సగటున 6.2 పరుగులు ఇచ్చారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పిచ్‌లు బౌలింగ్‌కు అనుకూలంగా లేకపోయినా, అదే పిచ్‌లపై కివీస్ బౌలర్లు ప్రభావం చూపగలగడం భారత్ వైఫల్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.
Details
పసలేని పేస్
ఈ సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రాను ఎందుకు ఎంపిక చేయలేదో స్పష్టత లేదు. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా విశ్రాంతి ఇచ్చి ఉండొచ్చు లేదా ఈ సిరీస్‌ను అంత ప్రాధాన్యంగా భావించకపోయి ఉండొచ్చు. కారణమేదైనా బుమ్రా లేని భారత పేస్ దళం పదును కోల్పోయింది. వికెట్ల వేటలో భారత పేసర్లు కివీస్ ఫాస్ట్‌బౌలర్లు క్రిస్టియన్ క్లార్క్, జేమీసన్ కంటే వెనుకబడ్డారు. నిలకడగా 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా ఆరు వికెట్లు తీయడం సానుకూలాంశమే. అయితే అతడు పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయాడు. ధారాళంగా పరుగులిచ్చాడు. భారత పేసర్లలో అత్యధిక ఎకానమీ రేట్ (6.81) అతడిదే కావడం గమనార్హం.
Details
పూర్తిగా నిరాశపరిచన ప్రసిద్ధ్
మహ్మద్ సిరాజ్ (3 వికెట్లు, ఎకానమీ 4.59) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ, జట్టుకు కావాల్సిన కీలక వికెట్లు అందించలేకపోయాడు. మరోవైపు ప్రసిద్ధ్ పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారీగా పరుగులిచ్చాడు. దీంతో టీమ్‌ఇండియా బౌలింగ్ కూర్పుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుమ్రా లేని పరిస్థితుల్లో డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే అర్ష్‌దీప్‌ను చివరి మ్యాచ్‌లోనైనా ఆడించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రసిద్ధ్ స్థానంలో అతడిని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిస్తే సిరీస్ ఫలితం భిన్నంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఆల్‌రౌండర్ కోటాలో వచ్చిన నితీశ్ బంతితో ప్రభావం చూపలేకపోవడం, వికెట్ల వేటలో విఫలమవడం కూడా జట్టుకు నష్టం చేసింది.
Details
సరైన ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి
ఆరంభంలో వికెట్లు తీసి, మధ్య ఓవర్లలో పరుగుల వేగాన్ని తగ్గించి, చివర్లో మెరుగ్గా బౌలింగ్ చేసే ఆల్‌ఫేజ్ బౌలర్ భారత్‌కు లేకపోవడం పెద్ద లోటు. 2027 ప్రపంచకప్‌కు ముందే ఈ సమస్య పరిష్కారంకాకపోతే ఇబ్బందులు తప్పవు. బుమ్రా, హార్దిక్ పాండ్య తిరిగి వస్తే పేస్ బలం పెరుగుతుందన్న నమ్మకం ఉన్నా, సరైన ప్రత్యామ్నాయాల లేమి మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
Details
స్పిన్‌లోనూ నిరాశ
బౌలింగ్ వైఫల్యంలో అత్యధిక బాధ్యత స్పిన్నర్లదే. ఎడమచేతి వాటం స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్ యాదవ్ పూర్తిగా తేలిపోయారు. గతంలో అద్భుతంగా రాణించిన కుల్‌దీప్ ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో 25 ఓవర్లు వేసి 7.28 ఎకానమీతో 182 పరుగులు ఇచ్చి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎకానమీ ఆరుకుపైనే ఉండగా, అసలు అతడు బౌలింగ్ చేస్తున్నాడన్న భావనే రాలేదు. మధ్య ఓవర్లలో ఈ స్పిన్నర్ల వైఫల్యం భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇద్దరూ కలిసి 48 ఓవర్లలో 323 పరుగులు ఇచ్చి కేవలం మూడు వికెట్లు పడగొట్టడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతోంది.
Details
ప్రభావం చూపని సుందర్
తొలి వన్డేలో మాత్రమే ఆడిన సుందర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇది ఒక్క సిరీస్ సమస్య కాదు. ఇటీవల కాలంలో సొంతగడ్డపై భారత స్పిన్నర్ల ప్రదర్శన క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పేలవ ప్రదర్శనల నేపథ్యంలో జడేజా వన్డే భవిష్యత్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి, బంతితోనూ బ్యాటుతోనూ వరుసగా విఫలమవుతున్నా జడేజాను కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్, 'ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సివస్తే అక్షర్‌నే తీసుకోవాలి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అతడు జడేజా కంటే ముందున్నాడు. అక్షర్‌ను కనీసం జట్టులోకి కూడా ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు.