LOADING...
Quinton de Kock: రీఎంట్రీలో అదరగొడుతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్
రీఎంట్రీలో అదరగొడుతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్

Quinton de Kock: రీఎంట్రీలో అదరగొడుతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అంతర్జాతీయ టీ20కు మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రీఎంట్రీ ప్రారంభంలో అతని ఫామ్ నిరాశపరచింది. మొదటి ఐదు మ్యాచ్‌లలో కేవలం 1, 23, 7, 0, 0 రన్స్‌లే చేశాడు, దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ గత డిసెంబరులో భారత్‌తో ముల్లాన్‌పుర్‌లో జరిగిన టీ20లో డికాక్ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. ఇక గురువారం సెంటూరియన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ పూర్తిగా రెచ్చిపోయాడు. 49 బంతుల్లో 115 రన్స్ సాధిస్తూ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

వివరాలు 

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించిన డికాక్

ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ముందున్నా.. ప్రోటీస్ బ్యాటర్లు ఏమాత్రం బెదరలేదు క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్ విరుచుకుపడి బ్యాటింగ్ చేసి, కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేసారు. రికెల్టన్ 36 బంతుల్లో 77 రన్స్ చేశాడు, డికాక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించాడు. వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్లు బాదాడు. 10 సిక్సులు, 6 ఫోర్లతో 115 పరుగులు బాదాడు.

వివరాలు 

2-0తో సిరీస్‌ను గెలిచిన దక్షిణాఫ్రికా

డికాక్ కేవలం 21 బంతుల్లో అర్ధ శతకం, 43 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి సిక్స్ కొట్టేందుకు ప్రయత్నిస్తూ అకీల్ హొసైన్ బౌలింగ్‌లో మిడ్-ఆఫ్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది అతడి రెండో టీ20 సెంచరీ. 2023లో ఇదే మైదానంలో వెస్టిండీస్‌పైనే డికాక్ శతకం సాధించగా, మళ్లీ అదే ఫార్మ్ చూపించాడు. ఈ విజయం ద్వారా దక్షిణాఫ్రికా సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. మూడో టీ20 మ్యాచ్ శనివారం జరుగనుండగా, ఆ తర్వాత జట్లు భారత్, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కి బయల్దేరనుంది.

Advertisement