Ashwin: భార్య ప్రీతి క్లిష్టమైన ప్రశ్నలకు.. అశ్విన్ సమాధానాలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అశ్విన్ సొంత మైదానంలో ప్రేక్షకుల మధ్య అద్భుత ప్రదర్శన చేయడం ఆనందంగా భావిస్తున్నా, అతని భార్య ప్రీతి నుంచి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు అశ్విన్ ఇచ్చిన సమాధానాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. బీసీసీఐ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.
ఫైఫర్ (ఐదు వికెట్లు) ప్రదర్శన చేసిన బంతిని ఇస్తాను: అశ్విన్
ప్రీతి: "డాటర్స్ డే రోజున మీ పిల్లలు ఏం ఇస్తావని అడుగుతున్నారు?" అశ్విన్:"వారి కోసం అద్భుతమైన బహుమతిగా నేను ఫైఫర్ (ఐదు వికెట్లు) ప్రదర్శన చేసిన బంతిని ఇస్తాను." ఇదే సమయంలో వారి కుమార్తెల్లో ఒకరు 'వద్దు'అని స్పందించడం గమనార్హం. ప్రీతి: "సొంత మైదానంలో ఇటువంటి ప్రదర్శన చేయడం ఎలా అనిపిస్తోంది?" అశ్విన్: "ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు.తొలి రోజు బ్యాటింగ్ చేయాల్సిన సమయం చాలా త్వరగా వచ్చింది.క్రీస్‌లోకి వస్తానని అసలు అనుకోలేదు,సెంచరీ గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పుడదాన్ని గుర్తుచేసుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంది.చెపాక్ మైదానం ఎప్పుడూ నాకు ప్రత్యేకం. ఇక్కడ ఆటపైన ఏదో మిస్టిక్ శక్తి ఉంది అనిపిస్తుంది,నేను ఏమి చెప్పలేను.ఇక్కడ సొంత ప్రేక్షకుల ముందు ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమైన అనుభూతే."
కుటుంబసభ్యులను పలకరించడం నాకు కాస్త ఇబ్బంది: అశ్విన్
ప్రీతి: "తొలి రోజు మాకు హాయ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ ప్రదర్శన నీ ఎనర్జీని పెంచిందనుకుంటున్నావా?" అశ్విన్: "నువ్వు కంప్లైట్ చేస్తున్నావు కదా, తొలిరోజు నీ వైపు కూడా చూడలేదు అనుకుంటున్నావు. దానికి కారణం ఉంది. మ్యాచ్ ఆడుతున్నప్పుడు కుటుంబసభ్యులను పలకరించడం నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు కూడా 'హాయ్ చెప్పలేదే' అని అడుగుతుంటారు. కానీ, మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను పూర్తిగా ఆట మీదే దృష్టి పెట్టాల్సి ఉంటుంది." ప్రీతి: "కంగ్రాట్స్! చెపాక్‌లో రెండో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసినందుకు అభినందనలు. పిల్లలు కూడా ఈ మ్యాచ్‌ను ఆస్వాదించారు." అశ్విన్: "ధన్యవాదాలు! ఇక్కడ మీ అందరి ప్రోత్సాహంతో నాకు అదృష్టం కలిగింది."