Page Loader
Rafael Nadal: రఫెల్‌ సాయంతో అనంతపురంలో టెన్నిస్‌ పాఠశాల..జాతీయ స్థాయిలో మెరిసిన 25 మంది 
రఫెల్‌ సాయంతో అనంతపురంలో టెన్నిస్‌ పాఠశాల

Rafael Nadal: రఫెల్‌ సాయంతో అనంతపురంలో టెన్నిస్‌ పాఠశాల..జాతీయ స్థాయిలో మెరిసిన 25 మంది 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

మట్టికోర్టుల కింగ్‌గా పేరు తెచ్చుకున్న రఫెల్‌ నాదల్‌, టెన్నిస్‌లో ఎన్నో గ్రాండ్‌ స్లామ్‌, ఒలింపిక్‌ విజయాలు సాధించిన ఈ దిగ్గజ ఆటగాడు, అనంతపురంతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని టెన్నిస్‌ అభివృద్ధికి వినియోగిస్తున్న నాదల్‌, అనంతపురంలో రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ) సహకారంతో నాదల్‌ ఎడ్యుకేషనల్‌, టెన్నిస్‌ స్కూల్‌ను స్థాపించారు. నాదల్‌ ఫౌండేషన్‌ టెన్నిస్‌ పాఠశాలలు ప్రపంచవ్యాప్తంగా మూడు ఉండగా, అందులో ఒకటి అనంతపురంలో ఉండటం విశేషం. ప్రతి ఏడాది ఈ అకాడమీ నిర్వహణకు నాదల్‌ రూ.55 లక్షలు ఖర్చు చేస్తున్నారు. టెన్నిస్‌ను పేద విద్యార్థులకు చేరువ చేయాలనే సంకల్పంతో ఈ పాఠశాల ప్రారంభించబడింది. స్పెయిన్‌,దుబాయ్‌లో ఉన్న పాఠశాలలతో పాటు అనంతపురంలో కూడా ఈ అకాడమీ సేవలందిస్తుంది.

వివరాలు 

ఆకాడమీ ప్రాధాన్యత 

టెన్నిస్‌ క్రీడ ఖరీదైనదిగా పరిగణించబడినప్పటికీ, నాదల్‌ అకాడమీలో పిల్లలకు ఉచితంగా శిక్షణ, పౌష్టికాహారం, ఆంగ్ల భాషలో శిక్షణ, కంప్యూటర్‌ అవగాహన వంటి సౌకర్యాలు అందజేస్తారు. ఈ అకాడమీ ప్రారంభమైన నాటినుంచి 2,500 మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు శిక్షణ పొందారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడు స్థాయుల్లో శిక్షణా కార్యక్రమం ఇక్కడ శిక్షణా కార్యక్రమం మూడు విభాగాల్లో విభజించబడింది. మొదటి స్థాయిలో ఎర్ర బంతితో పాయింట్ల లెక్కింపు,ఆధునిక సాంకేతికతలు నేర్పిస్తారు. రెండో స్థాయిలో నారింజ బంతితో ఫోర్‌హ్యాండ్,బ్యాక్‌హ్యాండ్ వంటి ప్రాథమిక సర్వీసులు నేర్పిస్తారు. మూడవ స్థాయిలో ఆకుపచ్చ బంతితో స్మాష్, డ్రాప్ షాట్లు పటిష్టం చేస్తారు.ఈ స్థాయిలో రాటుదేలిన క్రీడాకారులు జాతీయ,రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.

వివరాలు 

2010లో ప్రారంభమైన నాదల్‌ టెన్నిస్‌ అకాడమీ 

గత 25 ఏళ్లుగా వెనుకబడిన అనంతపురం జిల్లాలో క్రీడా సాంస్కృతిక వికాసానికి ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కృషి చేస్తోంది. ఈ దిశగా, ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్,ఆయన తనయుడు మాంచో ఫెర్రర్, అనంత క్రీడా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, సాఫ్ట్‌బాల్, జూడో, ఆర్చరీ వంటి విభిన్న క్రీడలకు ప్రోత్సాహం లభించింది. దీనిలో భాగంగా, ఆర్డీటీ పేద పిల్లలకు టెన్నిస్‌ను చేరువ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చింది.

వివరాలు 

 శిక్షణ పొందుతున్నయువత 

ఈ ప్రయత్నాన్ని టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఎలాంటి సంకోచం లేకుండా సానుకూలంగా స్పందించారు. నాదల్, తన తల్లి మరియా ఫెరారాతో కలిసి 2010 అక్టోబర్ 17న అనంతపురం క్రీడాగ్రామంలో నాదల్ టెన్నిస్ పాఠశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అకాడమీలో ఎంతో మంది పిల్లలు, యువత శిక్షణ పొందుతూ తమ ఆటను మెరుగుపరుచుకుంటున్నారు.