IND vs AFG: రహ్మత్ షా హాఫ్ సెంచరీ వృథా.. సుతార్ ధాటికి అఫ్గాన్ ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే కుప్పకూలింది. మూడో రోజు ఆటను 113/5 స్కోరుతో ప్రారంభించిన అఫ్గాన్ జట్టు చివరకు 152 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధారంగా 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో రహ్మత్ షా ఒక్కడే నిలకడగా ఆడి 135 బంతుల్లో 60 పరుగులు చేసి అర్ధశతకం నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌పై అర్ధశతకం సాధించిన తొలి అఫ్గానిస్థాన్ బ్యాటర్‌గా రహ్మత్ షా చరిత్ర సృష్టించాడు. అయితే మిగతా బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోలేక తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు.
వివరాలు
ప్రసిద్ధ్ కృష్ణకి మూడు వికెట్లు
భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ సాధించాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 564/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బౌలింగ్‌లోనూ ఆధిపత్యం చెలాయించి అఫ్గాన్‌ను భారీ ఒత్తిడిలోకి నెట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన మానవ్ సుతార్ అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
వివరాలు
రెండో బౌలర్ గా రికార్డు
టెస్టు కెరీర్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు 2008లో ఆస్ట్రేలియాపై 5/71 గణాంకాలతో అమిత్ మిశ్రా ఈ ఘనతను అందుకున్నాడు. 412 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన టీమిండియా అఫ్గానిస్థాన్‌ను ఫాలోఆన్ ఆడిస్తోంది. లంచ్ విరామ సమయానికి ఫాలోఆన్‌లో అఫ్గాన్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. సెథిఖుల్లా అటల్ 16 పరుగులతో, అబ్దుల్ మాలిక్ 2 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.