LOADING...
Chinnaswamy Stadium: అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లకు విశిష్ట సత్కారం
అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లకు విశిష్ట సత్కారం

Chinnaswamy Stadium: అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లకు విశిష్ట సత్కారం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 06, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అద్భుతంగా రాణించి పరుగుల వర్షం కురిపించారు. వారు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై దాడి చేస్తూ వరుసగా బౌండరీలు సాధించారు. దాంతో ఆర్సీబీ 250 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి, 43 పరుగుల తేడాతో సీఎస్కేపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందుగా భారత క్రికెట్ దిగ్గజాలు అయిన రాహుల్ ద్రావిడ్, అనీల్ కుంబ్లేలకు ప్రత్యేక గౌరవం అందింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) బెంగళూరులోని ఎం. చిన్ణస్వామి స్టేడియంలోని రెండు ఎండ్‌లకు ఈ ఇద్దరి పేర్లు పెట్టింది. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ ప్రారంభానికి ముందు కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ సమక్షంలో కార్యక్రమం జరిగింది.

వివరాలు 

థ్యాంక్స్ చెప్పిన ద్రవిడ్

ఈ సందర్భంగా పాత బీఈఎంఎల్ ఎండ్‌ను ద్రవిడ్ పేరుతో మార్చగా, పెవిలియన్ ఎండ్‌కు కుంబ్లే పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో కేఎస్‌సీఏ ప్రతినిధులు, అలాగే ద్రవిడ్, కుంబ్లే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్ తన భావాలను వ్యక్తం చేస్తూ, "ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. నేను ఈ స్థాయికి రావడానికి ఈ మైదానం ప్రధాన కారణం. కర్ణాటక క్రికెట్ సంఘానికి నా కృతజ్ఞతలు" అని చెప్పారు.

వివరాలు

ఆ పేర్లు పెట్టడానికి కారణమదేనా? 

అలాగే కుంబ్లే కూడా తన అనుభవాలను పంచుకుంటూ, "నేను తొమ్మిదేళ్ల వయసులో మొదటిసారి ఇక్కడికి వచ్చి ఒక మ్యాచ్ చూశాను. ఇప్పుడు అదే స్టేడియంలో ఒక ఎండ్‌పై నా పేరు కనిపించడం ఎంతో ఆనందంగా ఉంది" అని తెలిపారు. భారత జట్టుకు ఎన్నో సంవత్సరాలు సేవలందించిన ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 24,177 పరుగులు సాధించగా, కుంబ్లే అన్ని ఫార్మాట్లలో కలిపి 956 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా, ద్రవిడ్, కుంబ్లే భారత మాజీ మహిళా క్రికెటర్ శాంత రంగస్వామి పేర్లతో స్టాండ్‌లు, ఎండ్‌లను నామకరణం చేయనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేఎస్‌సీఏ ముందుగానే ప్రకటించింది.

Advertisement