విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు
న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం భారత్ సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక విషయాలను చెప్పారు. ప్రస్తుతం సెంచరీలు మీద సెంచరీలు బాదేస్తున్నటీమిండియా స్టార్ బ్యాట్‌మెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి ఆరు మ్యాచ్‌లు ఆడి, 296 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే టీ20ల్లో విరాట్ కోహ్లీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. న్యూజిలాండ్ తో భారత్ మూడో వన్డేకు ముందు విలేకర్ల ఆడిగిన ప్రశ్నకు భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ బదులిచ్చాడు.
టీ20ల్లో సీనియర్లకు విశ్రాంతి
గతేడాది T20I జట్టులో విరాట్ స్థానం ప్రశ్నార్థకంగా ఉందని ఓ విలేకరి రాహుల్ ద్రవిడ్ అడుగుతుండగా... ద్రవిడ్ కలుగజేసుకొని అసలు అతడిని తప్పించాలనే ఉద్దేశం తమకు లేదని, తమ వల్ల ఆ పని కాదని ద్రవిడ్ స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయాల్లో కొన్ని సిరీస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని, బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ కు అర్హత సాధించాల్సిన అవసరం ఉంటుందని ద్రవిడ్ చెప్పాడు. అయితే వచ్చే టీ20 మ్యాచ్‌లకు రోహిత్ తో పాటు కోహ్లీ, మరో ఇద్దరు సీనియర్లు విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించారు.