DC vs RR: హాఫ్ సెంచరీలతో చెలరేగిన రాహుల్, నిస్సాంక.. రాజస్థాన్ పై ఢిల్లీ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 19లో మరో హైఓల్టేజ్ మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. వరుస ఓటముల పరంపరకు తెరదించుతూ ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కేఎల్ రాహుల్ (75), పాథుమ నిస్సాంక (62) అర్ధశతకాలతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన ఢిల్లీ, 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
వివరాలు
రాణించిన కెప్టెన్ రియాన్ పరాగ్
ఆర్‌ఆర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ (90) అద్భుతంగా రాణించగా, ధ్రువ్ జురెల్ (43), డొనొవన్ ఫెరీరా (47) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రాజస్థాన్‌కు షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (6) తొలి బంతికే సిక్సర్ బాదినప్పటికీ మూడో బంతికే స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (4)ను రెండో ఓవర్‌లో జేమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత జతకట్టిన రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జురెల్ (43) ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
వివరాలు
చివర్లో విజృంభించిన డొనొవన్ ఫెరీరా
అనంతరం పరాగ్ 90 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. జడేజా (20) కొంత మేర రాణించాడు. చివర్లో డొనొవన్ ఫెరీరా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 47 పరుగులు చేసి రాజస్థాన్‌ను 225 పరుగుల భారీ స్కోర్ దాటించాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి ప్రభావం చూపించాడు. జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు. 226 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాథుమ నిస్సాంక మెరుపు ఆరంభం ఇచ్చారు. పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేశారు.
వివరాలు
తొలి వికెట్ కు 110 పరుగుల భాగస్వామ్యం
నిస్సాంక 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత రాహుల్ (75), నితీష్ రాణా (33) వేగంగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే వేగం పెంచే క్రమంలో ఇద్దరూ వెంటవెంటనే ఔట్ అయ్యారు. చివర్లో స్టబ్స్ (18), ఆశుతోష్ శర్మ (25) బాధ్యతాయుతంగా ఆడి మిగతా లాంఛనాన్ని పూర్తి చేసి ఢిల్లీకి విజయాన్ని అందించారు. రాజస్థాన్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, జడేజా తలో వికెట్ సాధించారు.