Ravindra Jadeja : ఆసియా కప్‌లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఇర్ఫాన్ రికార్డు బద్దలు!
కొలంబో వేదికగా జరిగిన భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచులో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత జట్టు ఆసియా కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచులో రెండు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో భారత తరుఫున అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా రవీంద్ర జడేజా రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(22) పేరిట ఉండేది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో శనకను ఔట్ చేయడం ద్వారా పఠాన్ రికార్డును జడేజా బ్రేక్ చేశారు.
అగ్రస్థానానికి ఎగబాకిన రవీంద్ర జడేజా
2004, 2008, 2012 ఆసియా కప్ టోర్నీలో భారత్ తరుఫున 12 మ్యాచులు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ మొత్తం 22 వికెట్లను పడగొట్టాడు. ఇక ఆసియా కప్‌లో 18 మ్యాచులు ఆడిన జడేజా 24 వికెట్లను తీశాడు. తద్వారా ఆసియా కప్‌లో ఇండియా తరుఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇర్ఫాన్ స్థానాన్ని జడేజా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇర్ఫాన్ రెండో స్థానానికి దిగజారాడు. భారత్ తరుఫున అత్యధిక వికెట్లు టాప్ 5 లిస్టులో కుల్దీప్ యాదవ్ (19), సచిన్ టెండూల్కర్(17), కపిల్ దేవ్ (15) వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. ఇక భారత్ తరుపున 181 వన్డేలు ఆడిన జడేజా 199 వికెట్లను పడగొట్టాడు.