LOADING...
IPL 2026: చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ విక్టరీ
చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ విక్టరీ

IPL 2026: చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ విక్టరీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 27, 2026
10:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. సోమవారం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌ను 9 వికెట్ల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో తన ఆరో విజయాన్ని నమోదు చేసుకోగా, ఢిల్లీ వరుసగా మూడో పరాజయంతో తీవ్ర ఒత్తిడిలో పడింది.

వివరాలు

దెబ్బకొట్టిన ఆర్సీబీ బౌలర్లు..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆర్‌సీబీ బౌలర్లు ప్రారంభం నుంచే తీవ్ర దెబ్బ కొట్టారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ నిప్పులు చెరిగే బంతులతో దిల్లీ బ్యాటర్లను కుదిపేశారు. ఫలితంగా టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. కేవలం 8 పరుగుల వద్దే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి అత్యంత దయనీయ స్థితిలో పడింది. సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే అవుట్ కాగా, కేఎల్ రాహుల్ (1), నితీశ్ రాణా (1) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి దిల్లీ స్కోరు 6 వికెట్లకు 13 పరుగులు మాత్రమే కావడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరుగా నిలిచింది.

వివరాలు

అత్యల్ప స్కోరుకే ఆలౌట్..

ఒక దశలో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అవుతుందేమో అనిపించిన ఢిల్లీని అభిషేక్ పొరెల్ (30) కొంతవరకు ఆదుకున్నాడు. ఏడో స్థానంలో వచ్చి బాధ్యతగా ఆడిన అతను జట్టు స్కోరును 75 పరుగులకు తీసుకెళ్లాడు. డేవిడ్ మిల్లర్ (19), కైల్ జేమీసన్ (12) సహకారంతో దిల్లీ కనీస గౌరవప్రద స్కోరును సాధించగలిగింది. చివరికి 16.3 ఓవర్లలో 75 పరుగుల వద్ద దిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించి 5 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీసి దిల్లీ వెన్నెముకను విరిచాడు. రసిఖ్ సలామ్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ సాధించి సహకరించారు.

Advertisement

వివరాలు

సిక్సర్లతో మ్యాచ్ ముగించిన విరాట్ కోహ్లీ..

తర్వాత 76 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆర్‌సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జాకబ్ బెతెల్ (20) అవుట్ అయినప్పటికీ, దేవదత్ పడిక్కల్ అద్భుతంగా చెలరేగాడు. అతను కేవలం 13 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (23) తన సహజ శైలిలో రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. ఢిల్లీ తరఫున కైల్ జేమీసన్ మాత్రమే ఒక వికెట్ తీసాడు. ఈ ఘన విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత బలపరుచుకోగా, బ్యాటింగ్ వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement