LOADING...
RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్‌సీబీకి భారీ షాక్.. జాకబ్ బెథెల్ సీజన్‌కు దూరం
ప్లేఆఫ్స్ ముందు ఆర్‌సీబీకి భారీ షాక్.. జాకబ్ బెథెల్ సీజన్‌కు దూరం

RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్‌సీబీకి భారీ షాక్.. జాకబ్ బెథెల్ సీజన్‌కు దూరం

వ్రాసిన వారు Moogati Shabari
May 24, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్లేఆఫ్స్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక బ్యాటర్ జాకబ్ బెథెల్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో మిగిలిన అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పటికే సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో లేకపోయాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని, ఇంగ్లాండ్ జాతీయ జట్టు సిరీస్‌లకు సిద్ధమయ్యేందుకు త్వరలోనే స్వదేశానికి వెళ్లనున్నట్లు సమాచారం. ప్లేఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే అత్యంత కీలకమైన 'క్వాలిఫైయర్-1' మ్యాచ్‌కు ముందు ఈ పరిణామం ఆర్‌సీబీకి పెద్ద షాక్‌గా మారింది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు, చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓటమిచవిచూసినా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

వివరాలు

గాయంతో మ్యాచ్‌కు దూరం..

జాకబ్ బెథెల్‌కు గాయం ఎలా జరిగిందంటే, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేయగా అతని ఎడమచేతి ఉంగరపు వేలికి తీవ్ర గాయం అయింది. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి విశ్రాంతి అవసరమని తేలింది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని తదుపరి చికిత్స కోసం స్వదేశానికి వెళ్లనున్నట్లు మే 23న ఆర్‌సీబీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. జాకబ్ బెథెల్‌ను విడుదల చేసే విషయంలో ఆర్‌సీబీతో పరస్పర అంగీకారం కుదిరిందని తెలిపింది.

వివరాలు

ఆర్సీబీకి తీవ్ర నష్టం..

బెథెల్ జట్టుకు దూరమవడం ఆర్‌సీబీకి నష్టమే అయినప్పటికీ, మరోవైపు జట్టుకు ఒక ఊరట కలిగించే వార్త కూడా వచ్చింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తొలి ప్లేఆఫ్ మ్యాచ్ సమయానికి స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తిరిగి జట్టులో చేరనున్నాడు. దీంతో అతను నేరుగా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ అందుబాటులో లేకపోవడంతో, ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను ఓపెనర్‌గా పంపించారు. అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేవలం 19 బంతుల్లోనే 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అ వెంకటేష్ అయ్యర్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఉపయోగించేలా ఆర్‌సీబీ జట్టు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement