RCB Vs GT: ఆర్సీబీ ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు వెళ్లిన ముంబై
ఐపీఎల్ 16వ సీజన్ లో చివరి లీగ్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచులో ఆర్సీబీని గుజరాత్ చిత్తు చేసింది. ఫ్లే ఆఫ్స్ రేసులో క్వాలిఫై కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆర్సీబీ చేతులెత్తేసింది. దీంతో ఐపీఎల్ లీగ్ 2023 నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. ఐపీఎల్ లో అత్యధికంగా ఏడుసార్లు సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు. చావా రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచులో మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
సెంచరీతో చెలరేగిన శుభ్‌మాన్ గిల్
198 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్.. కేవలం 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మాన్ గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు సాయంతో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విజయశంకర్ 35 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులతో చెలరేగాడు. కీలక మ్యాచులో ఆర్సీబి ఓడిపోవడంతో 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఈసారైనా కప్పు కొట్టాలని భావించినా ఆర్సీబీ నిరాశే మిగిలింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు, విజయ్ కుమార్, హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ తో రాణించారు.