Loading...
Indian women's hockey team: జర్మనీపై ఘన విజయం.. అయిదో స్థానంతో టోర్నీ ముగింపు
జర్మనీపై ఘన విజయం.. అయిదో స్థానంతో టోర్నీ ముగింపు

Indian women's hockey team: జర్మనీపై ఘన విజయం.. అయిదో స్థానంతో టోర్నీ ముగింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల హకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరలేకపోయిన భారత జట్టు.. టోర్నీలో మెరుగైన స్థానంతో ముగించింది. గురువారం జరిగిన 5-6 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో బలమైన జర్మనీని 3-1 తేడాతో ఓడించిన సలీమా టెటె బృందం ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్‌ తొలి రెండు క్వార్టర్లలో భారత్, జర్మనీ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. 22వ నిమిషంలో భారత్‌కు మంచి అవకాశం లభించింది. నవ్‌నీత్‌ కౌర్‌ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్‌ స్ట్రాక్‌ అడ్డుకుంది. బంతి గోల్‌కు అత్యంత సమీపంలోకి వెళ్లినా.. సలీమా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

వివరాలు

చివరి నిమిషంలో గోల్ చేసిన జర్మనీ

అయితే మూడో క్వార్టర్‌లో భారత దాడులకు ఫలితం దక్కింది. 43వ నిమిషంలో నేహా నుంచి బంతిని అందుకున్న ఇషిక.. రివర్స్‌ హిట్‌తో బంతిని గోల్‌లోకి పంపింది.

దీంతో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే మరో రెండు గోల్స్‌ నమోదయ్యాయి.

నవ్‌నీత్‌ కౌర్‌ 44వ, 47వ నిమిషాల్లో వరుసగా గోల్స్‌ చేసి భారత్‌కు 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది.

ఇదే స్కోరుతో మ్యాచ్‌ ముగుస్తుందని అనిపించినప్పటికీ.. చివరి నిమిషాల్లో జర్మనీ గోల్‌ చేసింది. 59వ నిమిషంలో లిన్‌ కింగ్‌ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో భారత్‌ ఆధిక్యం 3-1కి తగ్గింది.

వివరాలు

గత 52 ఏళ్లలో భారత మహిళల జట్టుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన

ఆ తర్వాత జర్మనీ నుంచి మరిన్ని దాడులు వచ్చినప్పటికీ.. భారత జట్టు ఆధిక్యాన్ని కాపాడుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ విజయంతో ప్రపంచకప్‌లో గత 52 ఏళ్లలో భారత మహిళల జట్టుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

అంతకుముందు 1974లో అజిందర్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్‌ తొలి ఎడిషన్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.

ADVERTISEMENT