రోహిత్ విశ్రాంతి తీసుకో.. లేకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో కష్టమే!
ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో ఓటమిపాలైంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించినా.. ఆవెంటనే రెండు వరుస పరాజయాలను చవిచూసింది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏడో స్థానానికి దిగజారింది. గుజరాత్ నిర్ధేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఎనిమిది బంతుల్లో రెండు పరుగులు చేసి పెవిలియానికి చేరాడు. వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ కొంచెం విశ్రాంతి తీసుకోవాలని, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు ఫ్రెష్ మైండ్ తో బరిలోకి దిగాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు రోహిత్ బ్రేక్ తీసుకోవాలి
గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో రోహిత్ ఔట్ అయిన తీరు తనను ఆందోళనకు గురి చేసిందని, ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు రోహిత్ బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, హిట్ మ్యాన్ కొంచెం ఒత్తిడిలో ఉన్నాడని, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో రాణించాలంటే కొంచె బ్రేక్ తీసుకుంటే మంచిదని గవాస్కర్ సూచించాడు. ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలని, బౌలర్లు పదే పదే తప్పులు చేస్తున్నప్పుడు కాస్త విరామం ఇవ్వాలన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే గుజరాత్ చేతిలో ముంబై 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.