Rishabh Pant: టెస్టుల్లో రిషబ్ పంత్ అరుదైన ఘనత.. మూడో వికెట్ కీపర్‌గా రికార్డు
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో క్యాచ్ పట్టడం ద్వారా టెస్టుల్లో 150 డిస్‌మిస్సల్స్ పూర్తి చేశాడు. కెరీర్‌లో 41వ టెస్టు ఆడుతున్న పంత్ ఇప్పటి వరకు 135 క్యాచ్‌లు పట్టి, 15 స్టంపింగ్స్ చేశాడు. ఈ జాబితాలో పంత్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అగ్రస్థానంలో ఎంఎస్ ధోనీ ఉన్నారు. టెస్టుల్లో మొత్తం 294 డిస్‌మిస్సల్స్ చేయడం ద్వారా ధోని ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత సయ్యద్ కిర్మాణి 198 డిస్‌మిస్సల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.
ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి తేస్తున్న భారత బౌలర్లు
మ్యాచ్ విషయానికొస్తే, మూడో టెస్టు తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. కేవలం 13.2 ఓవర్లపాటు మాత్రమే ఆట సాగగా, ఆ తర్వాత రోజు ఆట ముందుగానే ప్రారంభమైంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చారు. భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఉస్మాన్ ఖవాజా, మెక్‌స్వీనీను పెవిలియన్‌కు పంపించాడు. నితీష్ బౌలింగ్‌లో లబుషేన్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం మూడు వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. హెడ్ (52*) స్మిత్ (44*) క్రీజులో ఉన్నారు.