Riyan Parag: వివాదాల మధ్య పరాగ్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కు సంబంధించిన వేప్ (ఈ-సిగరెట్) వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ వినియోగిస్తూ ఆయన కెమెరాలకు కనిపించాడు. నిబంధనలను అతిక్రమించినందుకు పరాగ్‌పై ఐపీఎల్ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల్లో భాగంగా అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ నమోదు చేశారు. పరాగ్ తన తప్పును స్వయంగా అంగీకరించడంతో, తదుపరి విచారణ అవసరం లేకుండా ముగిసింది.
వివరాలు
పరాగ్ ఏమన్నాడంటే..
ఈ సంఘటనపై అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం పరాగ్ స్పందించాడు. తాను విమర్శలను పెద్దగా పట్టించుకోనని, తన పూర్తి దృష్టి ఆటపైనే ఉందని వెల్లడించాడు. "ఈ విషయంపై ఎవరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. రోజు చివరికి నా బాధ్యత జట్టుకు రెండు పాయింట్లు అందించడం. బయట జరిగే విషయాలపై నేను దృష్టి పెట్టను. జట్టు విజయమే ముఖ్యమైనది. వ్యక్తిగత విషయాలు నా ఏకాగ్రతను దెబ్బతీయవు," అని పరాగ్ స్పష్టం చేశాడు.
వివరాలు
ప్లేఆఫ్స్ రేస్‌లో రాజస్థాన్..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 90 పరుగులు సాధించాడు. మంచి ఫామ్‌లోకి వచ్చి కెప్టెన్‌గా చక్కటి ఇన్నింగ్స్ ఆడినా, తన జట్టును విజయానికి తీసుకెళ్లలేకపోయాడు. ఈ సందర్భంలో వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం ముఖ్యమని ఆయన పేర్కొన్నాడు. "నేను ఎంత బాగా ఆడినా, జట్టు ఓడిపోతే ఆ ఇన్నింగ్స్‌కు ప్రాధాన్యం ఉండదు. పెద్ద స్కోర్ చేసినా ఓటమి బాధ కలిగిస్తోంది. ప్రస్తుతం మాకు ఒక వారం విరామం ఉంది. ఆ సమయంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటాం. ఇప్పుడైతే రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేస్‌లో ఉంది, కాబట్టి మా దృష్టి మొత్తం మ్యాచ్‌లపై ఉంది," అని పరాగ్ తెలిపాడు.