Page Loader
Rohit Sharma Out: రోహిత్ ఔట్ విషయంలో స్టార్ స్పోర్ట్స్ వివరణ
రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూపై స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసిన ఫొటో

Rohit Sharma Out: రోహిత్ ఔట్ విషయంలో స్టార్ స్పోర్ట్స్ వివరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2023
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో రోహిత్(7) పూర్తిగా నిరాశపరిచాడు. వానిందు హసరంగా వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రోహిత్ శర్మ ఎల్బీగా వెనుదిరిగాడు. ముందుగా అంపైర్ ఔటివ్వకపోవడంతో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రివ్యూ తీసుకొని ఫలితాన్ని రాబట్టాడు. అతడు స్టంప్స్ కు మూడు మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న కూడా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది.రోహిత్ ఆ సమయంలో స్టంప్ నుంచి 2.9 మీటర్ల దూరంలోనే ఉన్నాడని వెల్లడించింది.

Details

థర్డ్ ఆంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మాజీ క్రికెటర్లు

రోహిత్ ప్యాడ్స్ కి బంతి తగిలిన సమయంలో 38 సెం.మీ ఎత్తులో ఉందని, స్టంప్స్ ఎత్తు మాత్రం 62 సెం.మీ అని స్టార్ స్పోర్ట్స్ ఫోటోను కూడా పోస్టు చేసింది. స్టంప్స్ నుంచి ఓ బ్యాటర్ 3 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే ఎల్బీడబ్య్లూ ఇవ్వకూడదనే నిబంధన ఉంది. రోహిత్ 3.7 మీటర్ల దూరంలో ఉన్నట్లు మాజీ క్రికెటర్లు మునాఫ్ పటేల్, మహ్మద్ కైఫ్ థర్డ్ ఆంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పెవిలియానికి చేరిన రోహిత్ నేరుగా ముంబై డగౌట్ లోకి వెళ్లి వీడియో అనలిస్ట్ తో మాట్లాడి అది ఎలా ఔటని ప్రశ్నించాడు. డీఆర్ఎస్ లో దూరాన్ని చెక్ చేయకుండా థర్డ్ అంపైర్ ఎలా తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.