రోహిత్ శర్మ కెప్టెన్సీని వదిలేయాలి : న్యూజిలాండ్ మాజీ క్రికెటర్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్లో అంచనాలకు మించి రాణించలేకపోతున్నాడు. దాంతో అతని ఆటతీరుపై విమర్శలు వినపడుతున్నాయి. ఐపీఎల్ లో రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని ఇప్పటికే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్, రోహిత్ శర్మపై అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తప్పుకోవాలని సూచించాడు. కెప్టెన్ గా ఒత్తిడి పెరిగిపోవడంతో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడని, కెప్టెన్సీగా బాధ్యతలను వదలుకుంటే వ్యక్తిగతంగా రాణించే అవకాశం ఉందని సైమన్ డౌల్ పేర్కొన్నారు.
రోహిత్ కెప్టెన్సీ వదిలేసి స్వేచ్ఛగా ఆడాలి
అదే విధంగా ఆర్సీబీ ఈ సీజన్లో కప్పు సాధించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, విరాట్ కోహ్లీ మాదిరిగా ఐపీఎల్ లో రోహిత్ కెప్టెన్సీని వదిలేసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని సైమన్ డౌల్ తెలిపాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోమని ప్రతిపాదించిన వాళ్లలో తాను ఒకరిని అని, ప్రస్తుతం రోహిత్ కూడా అదే స్థితిలో ఉన్నాడని వివరించాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో బెంగళూరు ఆటగాళ్లు ప్రదర్శన చూసిన తర్వాత ఈ జట్టు ఎందుకు ఇంతవరకు టైటిల్ సాధించలేదో అర్థం కాలేదన్నారు. ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది.